‘బంగార్రాజు’ వేసవికి రావడం కష్టమే..

‘మన్మథుడు 2’ తర్వాత నాగార్జున నుంచి సినీప్రియులు కోరుకుంటున్న చిత్రాల్లో ‘బంగార్రాజు’ ఒకటి. కల్యాణ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన హిట్‌ చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయిన’కు సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ ఇది. దీనిపై దాదాపు మూడేళ్ల క్రితం నుంచే దృష్టి సారించారు కల్యాణ్‌. అంతేకాదు నాగ్‌ తనయుడు చైతన్య కోసం ప్రత్యేకంగా ఓ పాత్రను డిజైన్‌ చేసి కొత్త కథను రాసుకున్నాడు. కానీ, ఇంతవరకు స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేయలేకపోయారు. అయితే ఇటీవల ‘మన్మథుడు 2’ ప్రచార కార్యక్రమంలో నాగ్‌ మాట్లాడుతూ ‘బంగార్రాజు’ను వేసవికి తీసుకొచ్చేలా ప్లాన్‌ చేస్తున్నామని, ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ తుది దశకు చేరుకుందని క్లారిటీ ఇచ్చారు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టీ చూస్తుంటే ఈ క్రేజీ సినిమా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. వాస్తవానికి ‘మన్మథుడు 2’ హడావుడి ముగిసిన వెంటనే నాగ్‌ ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని భావించారు. అయితే ఇటీవలే దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ సోదరుడు మరణించడంతో ఆయన సొంతూరుకు వెళ్లిపోయారు. దీంతో స్క్రిప్ట్‌ పనులు మరింత ఆలస్యమవుతున్నాయి. ఇక ప్రస్తుతానికి నాగ్‌ చేతిలోనూ ‘బ్రహ్మాస్త్ర’ తప్ప మరే చిత్రమూ లేదు. ధనుష్‌తో తమిళ్‌లో ఓ మల్టీస్టారర్‌ చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలొచ్చినప్పటికీ.. తాజాగా దాన్ని ఆపివేసినట్లు నాగ్‌ ఇటీవలే తెలియజేశారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.