‘మన్మథుడు’ క్రెడిట్‌లో త్రివిక్రమ్‌ పేరెక్కడ??

నాగార్జున సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్ల జాబితాను తీస్తే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘మన్మథుడు’ చిత్రమే. విజయ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ కథ, సంభాషణలు అందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర విజయంలో ప్రధాన భూమిక పోషించినది కూడా మాటల మాంత్రికుడి డైలాగ్‌లు, పంచ్‌లే అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ రాబోతున్న సంగతి తెలిసిందే. నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించారు. ఆగస్టు 9న ఇది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహంచారు. ఈ సందర్భంగా నాగ్‌ తన ‘మన్మథుడు’కు పని చేసిన దర్శకుడు విజయ భాస్కర్‌ను, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే అతి ముఖ్యమైన త్రివిక్రమ్‌ను మాత్రం వేడుకకు పిలవలేదు. అంతేకాదు.. ఈ కార్యక్రమంలో ‘మన్మథుడు’ గురించి ప్రస్తావిస్తూ ఆ చిత్ర సృష్టికర్త విజయ భాస్కరే అని అన్నారు. ఆ సినిమాలోని పంచ్‌లన్నీ కూడా ఆయన ఘనతే అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. కానీ, ఈ చిత్ర విజయానికి అసలు కారణమైన త్రివిక్రమ్‌ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఇప్పుడిది త్రివిక్రమ్‌ అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు. నాగ్‌ ప్రీరిలీజ్‌ వేడుకకు ‘మన్మథుడు’ టీం మొత్తాన్ని పిలవాలని నిర్ణయించుకున్నప్పుడు త్రివిక్రమ్‌ను అసలు ఆహ్వానించాడా? లేదా? అన్నది సందేహం. ఒకవేళ ఆయన పిలిచి.. త్రివిక్రమ్‌ రాలేని పరిస్థితిలో ఉండి ఉంటే కనీసం దాని గురించైనా వేదికపై నాగ్‌ ప్రస్తావించేవారు. కానీ, అది జరుగకపోగా.. కనీసం వేదికపై ఒక్కసారి కూడా నాగ్‌ మాటల మాంత్రికుడి పేరెత్తకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తంగా ఈ వ్యవహారమంతా జాగ్రత్తగా గమనిస్తే.. త్రివిక్రమ్‌కు నాగ్‌కు మధ్య ఏవో అభిప్రాయ భేదాలు తలెత్తినట్లుగా సందేహాలు కలుగుతున్నాయి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.