నితిన్‌ అంధుడిగా మారబోతున్నాడా?

చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు చేసేస్తున్నాడు నితిన్‌. ప్రస్తుతం ఆయన చేతిలో ‘భీష్మ’తో పాటు ‘రంగ్‌దే’ చిత్రాలు ఉన్నాయి. ఈ రెండూ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఓవైపు ఇవి సెట్స్‌పై ఉండగానే ముచ్చటగా మరో ప్రాజెక్టుకూ గీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడట నితిన్‌. గతేడాది బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘అంధాదున్‌’ చిత్ర తెలుగు రీమేక్‌లో ఆయన కథానాయకుడిగా నటించబోతున్నాడట. తాజాగా ఈ చిత్ర రీమేక్‌ హక్కులను నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి దక్కించుకున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఓ సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంతో సాగే ఈ కథలో కథానాయకుడు ఓ అంధుడిగా కనిపిస్తాడు. ఈ పాత్రను మాతృకలో ఆయుష్మాన్‌ ఖురానా చేయగా.. ఇప్పుడు నితిన్‌కు ఆ అవకాశమొచ్చింది. మరి ఈ చిత్రాన్ని కూడా బాలీవుడ్‌ వెర్షన్‌ను తెరకెక్కించిన శ్రీరామ్‌ రాఘవన్‌తోనే రూపొందిస్తారా? లేక మరెవరైనా అనుభవమున్న దర్శకుడికి అప్పజెప్తారా? అన్నది వేచి చూడాలి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.