‘ఎన్టీఆర్‌’ అవకాశంపై విద్యాబాలన్‌ ఆనందం

‘‘ఎన్టీఆర్‌ బయోపిక్‌లో నటించడాన్ని ఎప్పటికీ మరచిపోలేను’ అంటోంది బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌. ఇందులో అవకాశం రావడం అదృష్టమని, షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్‌ జీవితానికి సంబంధించిన విశేషాలను తెలుసుకోవడం గొప్ప అనుభూతి అని చెబుతోంది. ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెకుతున్న ‘ఎన్టీఆర్‌’లో బసవతారకం పాత్రలో విద్యా నటిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యాబాలన్‌ బాలీవుడ్‌ మీడియాతో ‘ఎన్టీఆర్‌’ చిత్రానికి సంబంధించి విషయాలను పంచుకుంది. ‘‘ నేను తొలిసారిగా తెలుగులో నటిస్తున్న చిత్రం ఇదే. ఇప్పటి వరకు నేను హిందీలో తప్ప బయట ఎక్కడా సొంతంగా డైలాగులు చెప్పలేదు. దక్షిణాది భాషల్లో మళయాళంలో మాత్రమే ఒకటి రెండు సన్నివేశాల నిడివిగల పాత్ర పోషించాను. ఈ చిత్రంలో పూర్తిస్థాయి పాత్ర పోషిస్తుండడం చాలా సంతోషంగా ఉంద’’ని చెప్పింది విద్యా. ఒకప్పటి తెలుగు నృత్య తార సిల్క్‌స్మిత జీవిత ఆధారంగా వచ్చిన ‘డర్టీపిక్చర్‌’లో నటించి, మంచిపేరు సంపాదించింది. ప్రస్తుతం ‘అమోలి’ అనే డాక్యుమెంటరీ చిత్రంలో నటిస్తుంది విద్యాబాలన్‌.


© Sitara 2018.
Powered by WinRace Technologies.