షాకింగ్‌.. రియల్‌ టైగర్‌తో యంగ్‌టైగర్‌ పోరు!!

రాజమౌళి చిత్రాలంటే కనువిందు చేసే దుమ్ములేపే హీరోయిజం, చూపు తిప్పుకోనివ్వని విజువల్‌ ఎఫెక్ట్స్‌తో పాటు అదరగొట్టే పోరాట ఘట్టాలకీ నెలవు. ఇక ఎన్టీఆర్‌ - రాజమౌళి కలయికలో వచ్చిన గత మూడు చిత్రాల్లో ‘స్టూడెంట్‌ నెం.1’ మినహా ‘సింహాద్రి’, ‘యమదొంగ’ల్లో కళ్లుచెదిరిపోయే యాక్షన్‌ ఎపిసోడ్లను చూపించారు. ఇక వీటిలో ‘యమదొంగ’లో చిరుతపులి - తారక్‌ ఛేజింగ్‌ సీన్‌ మరింత హైలైట్‌గా నిలిచింది. అయితే తాజాగా తన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కోసం తారక్‌తో ఓ అదిరిపోయే పోరాట ఘట్టాన్ని డిజైన్‌ చేశారట జక్కన్న. ఏకంగా ఓ నిజమైన పులితో ఎన్టీఆర్‌ భీకరంగా పోరాడబోతున్నాడట. ఈ చిత్రంలో కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించనుండగా.. మరో హీరో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి మాత్రం బల్గేరియాలో ఎన్టీఆర్‌పైన కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని యాక్షన్‌ సీన్స్‌ను ప్లాన్‌ చేశారట. వీటిలో అన్నింటికంటే హైలైట్‌గా నిలిచేది పులితో తారక్‌ చేయబోయే పోరాట ఘట్టమేనట. శిక్షణ పొందిన ఓ రియల్‌ టైగర్‌తో యంగ్‌టైగర్‌ తలపడతాడట. దీన్ని అంతర్జాతీయ ఫైట్‌ మాస్టర్స్‌ ఆధ్వర్యంలో ఎంతో సహజంగా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలోనే ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ మొదలుకానున్నట్లు సినీవర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.