అల్లూరి.. భీమ్‌ను అలా కలుస్తాడట!!

‘బాహుబలి’ చిత్రాల తర్వాత దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి నుంచి రాబోతున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఇందులో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా రాజమౌళి పుట్టినరోజును పురస్కరించుకోని ఈ చిత్రం నుంచి ఏదైనా సర్‌ప్రైజ్‌ వస్తుందేమో అని ఆశించారు ఆయన అభిమానులు. కానీ, వారి ఆశలు ఫలించలేదు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఆసక్తికర విషయమొకటి బయటకొచ్చింది. ఈ చిత్రంలో అల్లూరి తొలిసారి కొమురం భీమ్‌ను ఎలా కలుసుకుంటాడు అన్నది లీక్‌ అయింది. జక్కన్న ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో ఓ ఫిక్షనల్‌ స్టోరీగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కథ ప్రకారం యుక్త వయసులో ఇంటి నుంచి బయటకొచ్చిన అల్లూరి, కొమురం ఒకరికొకరు స్ఫూర్తిగా స్వాతంత్య్ర పోరులో కత్తి దూస్తారు. అయితే ఈ చిత్రంలో వీళ్లిద్దరూ తొలిసారి ఎలా కలుసుకుంటారనేది జక్కన్న తనదైన శైలిలో ఆసక్తికరంగా రాసుకున్నాడట. అదెలాగంటే.. ఓ ఊరిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ చిన్నపాప చిక్కుకుపోవడం.. ఆ పసిదాని పాణాలు కాపాడటం కొమురం ఓ అద్భుతమైన సాహసం చేయడం వంటివి చేస్తాడట. సరిగ్గా అదే సమయంలో అల్లూరి అతని ధైర్య సాహసాలు చూసి తనతో చేయి కలుపుతాడట. ఆ తర్వాత వీరి స్నేహ బంధం పోరు బాటలో సాగుతుందట. ఇలా కొమురం భీమ్, అల్లూరిల మధ్య తొలి సీన్‌ ఉంటుందని చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఎపిసోడ్‌ ఎంతో భావోద్వేగాలతో నిండి ఉంటుందని వార్తలొస్తున్నాయి. మరి వీటిల్లో వాస్తవమెంతన్నది తెలియాలంటే వచ్చే ఏడాది జులై 30 వరకు వేచి చూడక తప్పదు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో అలియా భట్‌ నటించనుండగా.. ఎన్టీఆర్‌కు జోడీని వెతికే పనిలో ఉంది చిత్ర బృందం. ఈ చిత్రానికి ‘రామ రౌద్ర రుషితం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. దీన్ని మిగిలిన భాషల్లో ‘రైజ్‌ రివొల్ట్ రివేంజ్‌’గా విడుదల చేయాలని చూస్తున్నారట.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.