పవన్‌తో చరణ్‌.. కల నెరవేరేది అప్పుడే!!

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత పవన్‌ కల్యాణ్‌ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘పింక్‌’ తెలుగు రీమేక్‌తో ఆయన్ని తెరపై చూపించేందుకు నిర్మాతలు దిల్‌రాజు, బోని కపూర్‌ సన్నాహలు ప్రారంభించేశారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై పవన్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రానప్పటికీ ఏ సమావేశంలోనూ ఈ అంశాన్ని ఖండించలేదు. కానీ, తాజాగా ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నేను సినిమాల్లోకి వస్తానో? రానో ఇంకా నిర్ణయించుకోలేదు కానీ, నిర్మాతగా మాత్రం సినిమాలు చేసుకుంటా. నాకు తెలిసింది సినిమాలొక్కటే.. కాబట్టి నా పని నేను చేసుకుంటే తప్పేంటి?’’ అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే పవన్‌ ఎప్పుడైతే నిర్మాతగా చేస్తా అని తన మనసులో మాట బయటపెట్టారో.. వెంçనే అందరి దృష్టి రామ్‌చరణ్‌పైనే పడింది. ఎందుకంటే ఇటీవలే చరణ్‌ ఈనాడుతో మాట్లాడుతూ ‘పవన్‌ బాబాయ్‌ నిర్మాణంలో ఓ సినిమా చేయాలనుందని’ మనసులో మాట బయట పెట్టారు. ఇప్పుడు స్వయంగా పవనే తాను నిర్మాతగా సినిమాలు చేస్తానని స్పష్టత ఇవ్వడంతో చరణ్‌ కోరిక త్వరలోనే నెరవేరేలా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను బట్టి చూస్తే వీళ్లిద్దరి కలయికను చూడటానికి మరింత సమయమే పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చెర్రీ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’తో బిజీగా ఉన్నారు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తయినా.. ఆ వెంటనే కొరటాలతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం చరణ్‌ ఆయనతోనే సినిమా చేయాల్సి ఉంటుంది. ఈలోపు పవన్‌ కూడా ఇటు ‘పింక్‌’ రీమేక్‌తో పాటు అటు క్రిష్‌ దర్శకత్వంలోనూ సినిమాలు పూర్తిచేయాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చే ఏడాదిలో వీరి కలయికను చూడటం కష్టమే. కాబట్టి అన్నీ అనుకున్నట్లు కుదిరితే 2021లో పవన్‌ - చరణ్‌ల కలయికలో ఓ సినిమా చూసే అవకాశం ఉంటుందేమో.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.