పరాకాష్ఠకు చేరిన అభిమానం..

సినిమాలకు తమిళనాడు ప్రజలకు విడదీయ రాని బంధం ఉంటుంది. సినీ హీరోలను దేవుళ్లుగా కొలవడం.. వారికి గుడులు కట్టి మరీ పూజించడం వంటి విపరీత పోకడలు అక్కడ కనిపించినంతగా మరెక్కడా కనిపించవు. ఇక తమ అభిమాన హీరోల చిత్రాల విడుదల సందర్భంగా ఫ్యాన్స్‌ చేసే హడావుడి కూడా ఓ స్థాయిలోనే కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు అది శ్రుతిమించి దాడులు చేసుకున్న సందర్భాలు అనేకం. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో మరొకటి చోటు చేసుకుంది. తమిళ నాట రజనీకాంత్‌కు ఎంతటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో.. అజిత్‌కు అదే స్థాయిలో ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రజనీ నటించిన ‘పేటా’, అజిత్‌ కుమార్‌ నటించిన ‘విశ్వాసం’ ఒకేరోజు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండు సినిమాలకు తమిళనాట మంచి టాక్‌ రావడంతో థియేటర్ల వద్ద అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని వేలూరులో ఓ థియేటర్‌ వద్ద రజనీ, అజిత్‌ల అభిమానులు మా హరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడంతో వారి మధ్య అలజడి చెలరేగింది. ఈ క్రమంలో అజిత్‌ అభిమానులు రజనీ సినిమా ఫ్లెక్సీలను చింపడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రమైంది. ఈ సందర్భంగా చెలరేగిన గొడవలో కొందరు కత్తులతో దాడికి దిగడంతో నలుగురు అభిమానులు కత్తి పోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల నేపథ్యంలో తమిళనాట రెండు సినిమాల థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. అభిమానుల పేరుతో సినిమాహళ్ల వద్ద ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

* థియేటర్‌ బయటే పెళ్లి!
రజనీ సినిమా విడుదల అంటే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. రజనీపై వారికి అభిమానం ఎంతగా ఉంటుందో నిరూపించే సంఘటన చెన్నైలో మరొకటి చోటు చేసుకుంది. గురువారం ‘పేట’ సినిమా విడుదల సందర్భంగా అంబసు, కమాచి అనే యువతీ యువకులు.. ఈ ముహూర్తాన్నే శుభముహూర్తంగా భావించారు. రజనీ వీరాభిమానులైన వారిద్దరు ఈ సందర్భంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ‘పేట’ సినిమా ఆడుతున్న ఉడ్‌లాండ్స్‌ థియేటర్‌ ముందే ఈ కల్యాణం జరిగింది. అక్కడే వివాహ వేదికను ఏర్పాటు చేసుకుని, వీరిద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. గతంలో రజనీ నటించిన సినిమాల పోస్టర్లు వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ జరిగిన వారి పెళ్లికి రజనీ అభిమానులందరూ ఆహ్వానితులే. ‘పేట’ సినిమా చూడడానికి వచ్చిన అభిమానులందరూ వీరి పెళ్లి చూసి హర్షం వ్యక్తం చేస్తూ అక్షింతలు వేశారు. వివాహం అనంతరం అభిమానులందరికీ భోజనాలు పెట్టారు.
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.