ఏదో ఒక పాఠం నేర్పుతుంది

తెరపైన ఒకొక్క పాత్ర ఒక్కో రకమైన జీవితాన్ని ఆవిష్కరిస్తుంటుంది. నటులు ఎలాంటి పాత్రల్నైనా అర్థం చేసుకుంటూ అందులో ఒదిగిపోయే ప్రయత్నం చేస్తుంటారు. మరి ఆ పాత్రల ప్రభావం నటుల నిజ జీవితాలపై ఎంత వరకు ఉంటుంది? ఇదే విషయాన్ని కథానాయిక పూజాహెగ్డేని అడిగితే... ‘‘ప్రేక్షకుడిపై ఒక సినిమా ఎంతటి ప్రభావం చూపిస్తుందో, అంతకుమించి ఉంటుంది. సెట్‌లో ప్రతీ సన్నివేశం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేస్తుంటాం. ఒక పాత్ర ఎందుకు అలా ప్రవర్తిస్తుందో, దాని గురించి చిన్నపాటి పరిశోధన జరుగుతుంటుంది. ఆ క్రమంలో ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. అందుకే ప్రతి సినిమాతోనూ వ్యక్తిగతంగా నాలో మార్పు కనిపిస్తుంటుంది. సినిమాల్లో వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రయినా సరే, అది ఏదో ఒక పాఠం నేర్పుతుంద’’ని చెప్పుకొచ్చింది పూజా. అయితే ఎన్ని పాత్రలు చేసినా... వాటన్నిటికంటే నా నిజజీవిత పాత్ర నాకు పదే పదే గుర్తుకొచ్చి, నాలో ఆలోచనలు రేకెత్తిస్తోందని చెబుతోందామె. ‘‘చాలా గమ్మత్తైన పరిణామాలు నా జీవితంలో చోటు చేసుకొన్నాయి. కథానాయికని అవుతానని అస్సలు అనుకోలేదు. కానీ నేనీ రంగంలోకి రావడం, రాణించడం... ఇంత మంది ప్రేమని పొందడం చూస్తుంటే ఎవరో నా పాత్రని చాలా అందంగా తీర్చిదిద్దినట్టు అనిపిస్తుంద’’ని సెలవిచ్చింది పూజా. ఆమె ప్రస్తుతం మహేష్‌తో కలిసి ‘మహర్షి’లోనూ, ప్రభాస్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.