టాక్సీ రాకున్నా.. మరొకటి పట్టాలపైకి!
రాహుల్‌ సాంకృతాయన్‌.. ‘ది ఎండ్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయం నూతన దర్శకుడితను. ఈ యువ దర్శకుడు తొలి ప్రయత్నం సరైన ఫలితాన్నివ్వకపోయినా.. క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండను ‘టాక్సీవాలా’గా మార్చి టాలీవుడ్‌లో అందరి దృష్టినీ ఆకర్షించాడు. అందులోనూ గీతాఆర్ట్స్‌ వంటి సంస్థ దీన్ని నిర్మించడంతో సినిమాపైనా భారీ అంచనాలేర్పడ్డాయి. రాహుల్‌ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ, అల్లు అరవింద్‌ ‘టాక్సీవాలా’ను ముందు వదలకుండా ‘గీత గోవిందం’ను తెరపైకి తీసుకురావడంతో రాహుల్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే ఒకరకంగా అల్లు తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు ‘టాక్సీవాలా’కే కలిసిరానుంది. తాజాగా ‘గీత గోవిందం’ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో దేవరకొండ మార్కెట్‌ మరింత విస్తృతం అయింది.. కాబట్టి ‘టాక్సీవాలా’ బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు సాధించే అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఇది విడుదల కాకముందే రాహుల్‌ మరో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. యువ కథనాయకుడు నిఖిల్‌తో ఓ సినిమా చేసేందుకు లైన్‌ క్లియర్‌ చేసుకున్నాడట. ఇటీవలే నిఖిల్‌కు ఓ థ్రిల్లర్‌ కథ వినిపించగా.. అది విపరీతంగా నచ్చడంతో వెంటనే ఆ ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడట. నిఖిల్‌ ‘ముద్ర’ తర్వాత మరే సినిమాను ఒకే చేయకపోవడంతో.. అతని తర్వాతి చిత్రం ఇదే అవనుంది. మొత్తానికి ‘టాక్సీవాలా’తో అవకాశాలు పెంచుకుందాం అనుకున్న రాహుల్‌కు.. అది విడుదల కాకముందే ఇలాంటి మంచి అవకాశం రావడంతో ఫుల్‌ ఖుషీగా ఉన్నాడట. ఇక ‘టాక్సీవాలా’ కూడా హిట్‌ సాధిస్తే.. నిఖిల్‌తో చేయబోయే సినిమాపై భారీ అంచనాలేర్పడతాయి. ప్రస్తుతం నిఖిల్‌ నటిస్తున్న ‘ముద్ర’ నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత రాహుల్‌ సాంకృతాయాన్‌ సినిమాను పట్టాలెక్కిస్తాడు. ఈలోపు ‘టాక్సీవాలా’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.


© Sitara 2018.
Powered by WinRace Technologies.