రానా ఫైనాన్స్‌.. నాని టెలికం.. అతను కంపు హీరో!!
చిత్రసీమలో కథానాయికగా రాణించాలంటే అందం, అదృష్టం, ప్రతిభతో పాటు కొన్ని తెలివితేటలూ అవసరమే. రకుల్‌లో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టే అటు ఉత్తరాదిలో ఇటు దక్షిణాదిలో వరుస అవకాశాలతో జోరు చూపిస్తోంది. ఈ భామలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఓవైపు యువ హీరోలతో ఆడిపాడుతూనే బాలకృష్ణ, నాగార్జున, అజయ్‌ దేవగణ్‌ వంటి అగ్ర హీరోలతోనూ జోడీ కట్టి మెప్పిస్తోంది. తాజాగా ఈ భామ చిత్రసీమలో తన తోటి కథానాయకులకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ ముద్దుగుమ్మ లక్ష్మీ మంచు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఫీట్‌ అప్‌ విత్‌ స్టార్స్‌’ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా లక్ష్మీ ఆమెకు ఓ ఆసక్తికరమైన ప్రశ్న విసిరింది. హోమ్‌ మినిస్టర్‌, ఫైనాన్స్‌ మినిస్టర్‌, టెలికం మినిష్టర్‌ పోస్టులను చిత్రసీమలో ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఏ హీరోలను ఎంచుకుంటావు అని ప్రశ్నించింది. దానికి రకుల్‌ బదులిస్తూ రానా, నాని, లక్ష్మీ పేర్లను చెప్పింది.


‘‘ఆర్థికశాఖను రానాకు మాత్రమే ఇస్తా. దానికి అతను తప్ప మరెవరూ సరిపోరు. డబ్బు వ్యవహారాల్లో ఆయన ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ఇక హోం మినిస్టర్‌ పోస్ట్‌ మాత్రం నీకే ఇస్తా లక్ష్మీ. ప్రతి స్టార్‌ను ఇంటికి పిలిచి చక్కగా మర్యాదలు చేస్తుంటావు. ఎవరికి ఏది కావాలంటే అది చేసి పెడుతుంటావు. ఇక టెలికం మినిస్ట్రీ మాత్రం నానికే అప్పజెపుతా. ఎప్పుడూ ఫోన్లోనే తలపెట్టి కనిపిస్తుంటాడు. అప్పుడు నాగార్జున సర్‌ కూడా వీడియోలో చూపించారు కదా’’ అంటూ సరదగా జవాబిచ్చింది రకుల్‌. ఈ సందర్భంగా ఓ హీరోతో తనకు ఎదురైన ఇబ్బందికర విషయాన్నీ బయటపెట్టింది. సెట్స్‌లో ఓ హీరోతో డ్యూయెట్‌లో నటిస్తున్నప్పుడు అతడి శరీరం నుంచి వచ్చే చెమట కంపు తట్టుకోలేక తెగ ఇబ్బంది పడిపోయిందట రకుల్‌. తన పరిస్థితిని అతనికి చెప్పలేక.. తనకీ ఏం చేయాలో అర్థం కాక ఆ పాట మొత్తం పెర్ఫ్యూమ్‌ కొట్టుకోని బలవంతంగా పూర్తి చేసిందట. కేవలం రకుల్‌ మాత్రమే కాదట.. ఆ సెట్స్‌లోని మిగతా సిబ్బంది కూడా హీరో కంపు భరించలేక రకుల్‌ చేసిన పనినే చేశారట. ఇంతకీ ఆ కథానాయకుడు ఎవరన్నది మాత్రం రకుల్‌ బయటపెట్టలేదు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.