అందుకే చిరు బయోపిక్‌లో చరణ్‌ నటించొద్దట!!

ప్రస్తుతం అటు బాలీవుడ్‌ నుంచి ఇటు టాలీవుడ్‌ వరకు బయోపిక్‌ ట్రెండ్‌ నడుస్తోంది. తాజాగా ‘గద్దలకొండ గణేష్‌’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నోటి వెంట చిరంజీవి బయోపిక్‌ అన్న మాట బయటకొచ్చింది. దీనిపై వరుణ్‌ మాట్లాడుతూ.. ‘చిరంజీవి బయెపిక్‌ తెరపైకి వస్తే.. ఆ పాత్రను చరణ్‌ అయినా చేయాలి, లేకుంటే నేనైనా చేస్తా’ అని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఇదే విషయంపై ‘సైరా’ థ్యాంక్యూ మీట్‌లో చిరు స్పందించారు. తన బయోపిక్‌కు రామ్‌చరణ్‌ అయితే కచ్చితంగా న్యాయం చేస్తాడు. కానీ, వాడు ఆ పాత్రను చేయడం నాకిష్టం లేదంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు. దీనికి గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘నా పాత్రను చరణ్‌ చేస్తే వందకు వంద శాతం న్యాయం చేస్తాడు. కానీ, ఇందులో కొన్ని సమస్యలున్నాయి. చరణ్‌ జన్మించే సన్నివేశంలో ఆ పసికందును తనే ఎత్తుకుంటే బాగోదు. అది స్క్రీన్‌పై చూసేందుకు ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే ఆ పాత్రను చెర్రీ చేయకూడదనుకుంటున్నా’’ అని క్లారిటీ ఇచ్చారు చిరు. మరి ఆ పాత్రకు ఇంకెవరైతే బాగుంటారు అనుకుంటున్నారు అని అడగ్గా.. ‘‘నేను వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటానో ఆ లుక్‌ సాయిధరమ్‌ తేజ్, వరుణ్‌ తేజ్, వైష్ణవ్‌ తేజ్‌లలో కనిపిస్తుంటుందని నా సన్నిహితులు అంటుంటారు. కాబట్టి వాళ్లలో ఎవరు చేసినా నాకు ఓకే’’ అన్నారు చిరు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.