‘జోరు’ పెంచిన రాశీఖన్నా
సినిమా హిట్‌ అవ్వకపోతే హీరోకి అవకాశాలు వస్తుంటాయి. హీరోయిన్లకు అలా ఉండదు. కథ బావుండక సినిమా పరాజయమైతే అది కథానాయిక వల్లనే అనే మాటలు వినిపిస్తాయి. అందుకే ఆచితూచి అడుగేయాలి వారు. తొలి సినిమా విజయం సాధిస్తే ఆ పరంపర కొనసాగించేందుకు తెగ కష్టపడాల్సి వస్తుంది. వ్యాయామాలు చేస్తూ నోరు కట్టేసుకుని ఛాన్సుల కోసం వెతుకుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్న కథానాయికల్లో రాశీ ఖన్నా ఒకరు.


శ్రీ సాయి శిరీష ప్రభావతిగా ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో పరిచయమై తన ‘జోరు’ చూపించింది. తర్వాత ‘జిల్‌’ అనిపించినా ఆశించిన ఫలితం అందుకోలేదు. ‘బెంగాల్‌ టైగర్‌’, ‘శివం’, ‘సుప్రీం’,‘టచ్‌ చేసి చూడు’, ‘ఆక్సిజన్‌’ చిత్రాల్లో నటించినా ‘తొలిప్రేమ’ సినిమాతోనే రాశీ ఈజ్‌ బ్యాక్‌ అనిపించుకుంది. ఇప్పుడు వరుస ప్రాజెక్టులు ఎంచుకుంటూ దటీజ్‌ రాశీ ఖన్నా అనిపించుకునేలా మారింది. విశాల్‌కు జంటగా ‘అయోగ్య’ చిత్రంలో నటించగా.. ఈ సినిమా 12న విడుదలకానుంది. విజయ్‌ సేతుపతితో మరో సినిమాలో నటిస్తుంది. విజయ్‌ 64వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాలో రాశి ఓ హీరోయిన్‌ అని సమాచారం. తెలుగులో.. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా వస్తున్న ‘ప్రతిరోజు పండగే’, నాగ చైతన్య- వెంకటేశ్‌ కలయికలో వస్తున్న ‘వెంకీ మామ’లో రాశినే కథానాయిక. అంతేకాదు అల్లు అర్జున్‌ త్వరలో చేయబోయే ‘ఐకాన్‌’ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్నట్లు సమాచారం. మరి ఇన్ని సినిమాలతో బిబీ అయిన రాశి ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.