ఇప్పుడు అలాంటి భయం లేదు!
‘‘కథలు ఫక్తు వాణిజ్య పంథాలో సాగుతున్న దశలోనే నటనతో మాదైన ప్రభావం చూపించాం. ఇప్పుడు కథానాయకులకు దీటుగా పాత్రలు లభిస్తున్నాయి. ఇది మాకు ఎంత మంచి పరిణామమో, అంతకుమించి సవాల్‌ కూడా’’ అంటోంది తమన్నా. తొలినాళ్లలో గ్లామర్‌ హంగులున్న పాత్రల్లోనే ఎక్కువగా కనిపించిన తమన్నా, కొంతకాలంగా నటనకి ప్రాధాన్యమున్న పాత్రలపై దృష్టిపెట్టింది. త్వరలోనే ‘దటీజ్‌ మహాలక్ష్మి’ అంటూ సందడి చేయనున్న ఈమె ప్రస్తుతం ‘ఎఫ్‌2’, ‘సైరా నరసింహారెడ్డి’ తదితర చిత్రాలతో బిజీగా గడుపుతోంది. కథానాయికలకి లభిస్తున్న పాత్రల విషయంలో మీ అభిప్రాయమేంటని అడిగితే ‘‘నటన పరంగా ప్రతిభ చూపించేందుకు మరిన్ని మంచి అవకాశాలు ఇప్పుడు లభిస్తున్నాయి. ఆడిపాడుతూనో లేదంటే, కాసింత పరిధి ఉన్న పాత్రల్లోనే మా ఉనికి చాటాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడలాంటి భయాలు అవసరం లేదు. మరింత స్వేచ్ఛతో పూర్తిస్థాయి పాత్రల్లో నటించే అవకాశం లభిస్తోంది. అయితే ఆ పాత్రలపై మాదైన ప్రభావం చూపించాల్సిన గురుతర బాధ్యత కూడా మాపైన ఉంది. ఈ తరహా కథల ఉద్ధృతి ఇలా కొనసాగాలంటే నటన పరంగా మేం చాలా చేయాల్సి ఉంటుంద’’ని చెబుతోంది తమన్నా.© Sitara 2018.
Powered by WinRace Technologies.