కత్తిరిస్తారనుకుంటే.. ‘సాహో’కి కలుపుతున్నారుగా!!

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్‌ ‘సాహో’.. ఆ అంచనాలను అందుకోవడంలో కాస్త తడబడిందనే చెప్పాలి. అయితే బాలీవుడ్‌లో వసూళ్ల సెంచరీ కొట్టడం.. దక్షిణాదిలో ప్రస్తుతానికి ‘సాహో’కి పోటీగా మరే సినిమా లేకపోవడం నిర్మాతలకు కాస్త ఊరట నిచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే టాక్‌తో సంబంధం లేకుండా రూ.370 కోట్లపైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రాన్ని మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని చిత్ర బృందం ఆలోచన చేస్తుంది. రెండు, మూడు రోజులుగా ఈ చిత్రానికి వసూళ్లు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మరే చిత్రంతో పోటీ లేకపోవడంతో అది ‘సాహో’కు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఇప్పుడీ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు తీసుకొచ్చేలా చేయడానికి ‘సాహో’కు కొత్తగా మరికొన్ని సన్నివేశాలను జోడించాలని ఆలోచన చేసిందట చిత్ర బృందం. వీటిలో ద్వితియార్థంలో బైక్‌ ఛేజింగ్‌ ఎపిసోడ్‌కు ముందు వచ్చే ప్రభాస్‌ ఇంట్రో సీన్‌ ఒకటి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. చిత్ర ఎడిటింగ్‌ సమయంలో నిడివి తగ్గించడానికి దీన్ని కూడా కత్తిరించేశారు. అయితే దీన్నిప్పుడు ప్రభాస్‌ అభిమానుల కోసమే ప్రత్యేకంగా తిరిగి కలుపుతున్నారట. అయితే ఇప్పటికే దాదాపు 2 గంటల 50 నిమిషాల నిడివితో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉన్న ‘సాహో’ను.. కాస్త కత్తెరిస్తారేమో అనుకుంటే ఇలా కలుపుకుంటూ పోవడం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచి చూడాలి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.