తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ని ఆపేశారట!!
                              

టాలీవుడ్‌ ట్రెండ్‌ సెట్టర్‌ ‘అర్జున్‌ రెడ్డి’ని తమిళ్‌లో ‘వర్మ’ పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో దేవరకొండ పాత్రను విక్రమ్‌ తనయుడు ధృవ్‌ చేస్తుండగా.. షాలిని పాండే పాత్రలో మేఘా చౌదరి నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు బాలా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది. అయితే ప్రస్తుతం కోలీవుడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని మానుకుందట చిత్ర బృందం. టీజర్ వచ్చినప్పటికీ నుంచి దీని మీద చాలా విమర్శలే వచ్చాయి. ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఒరిజనల్‌ కథలోని ఆత్మను పట్టుకోవడంలో బాలా తడబడ్డాడని విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల ట్రైలర్‌ విడుదలవగా దానిపైనా ఇదే స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ ప్రభావం చూపించాయో ఏమో మొత్తానికి నిర్మాణ సంస్థకే ఫస్ట్ కాపీ చూసాక చిర్రెత్తుకొచ్చిందట. ఇదేంటి అర్జున్ రెడ్డి తమిళ్ లో ఇలా తయారయ్యింది అనుకుని మొత్తాన్ని కాన్సిల్ చేసి రీ షూట్ చేయాలనీ నిర్ణయించుకున్నట్టు తమిళ సినీ వర్గాల నుంచి వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించిన లెటర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇదే నిజమైతే దక్షిణాదిలో ఇలా ఫస్ట్ కాపీ అయ్యాక నిర్మాత రిజెక్ట్ చేసిన అగ్ర దర్శకుడి సినిమా ‘వర్మ’ వర్మనే అవుతుంది. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే దాకా వేచి చూడాల్సిందే.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.