టాలీవుడ్‌ స్టార్లలో రౌడీ హీరోనే టాప్‌!!

తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోల స్థాయికి ఎదిగిపోయాడు విజయ్‌ దేవరకొండ. ఇక యువతరంలో ఈ రౌడీ హీరోకున్న క్రేజ్‌ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. వేదికలపై అతను మాట్లాడే మాటలు, చూపించే యాటిట్యూడ్, సినిమాలతో అతడు పంచే సందడి కుర్రకారులో దేవరకొండకు ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం ఈ యువ హీరో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ పరంగా ప్రభాస్, మహేష్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌ వంటి స్టార్‌హీరోలందరినీ వెనక్కు నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. తాజా సమాచారం ప్రకారం.. ఇన్‌స్టాలో ఈ రౌడీ హీరోను అనుసరిస్తున్న వారి సంఖ్య నాలుగు మిలియన్లను దాటేసింది. తెలుగులో మరే స్టార్‌ హీరోకూ ఇన్‌స్టాలో ఇంతమంది ఫాలోవర్స్‌ లేరట. ఇక ఈ రౌడీకి దరిదాపుల్లో ఉన్న స్టార్లు మరెవరైనా ఉన్నారంటే అది మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ మాత్రమేనట. ఇక మిగతా స్టార్లు ఎన్టీఆర్, నాని, రామ్‌చరణ్, ప్రభాస్‌ వంటి వారైతే దేవరకొండకు దరిదాపుల్లో కూడా లేరట. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను అనుసరిస్తున్నవారు 4.1 మిలియన్ల మంది ఉండగా.. బన్నీ 3.7 మిలియన్లు, మహేష్‌బాబు 3.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన ప్రభాస్‌ను 2.7 మిలియన్ల మంది అనుసరిస్తుండగా.. రామ్‌చరణ్‌ను దాదాపు 6.55 లక్షల మంది ఫాలో అవుతున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.