వేషం తన్నుకుంటూ వస్తుందన్నాడు!

పెళ్లిచూపులు’, ‘అర్జున్‌రెడి’్డ సినిమాలతో యూత్‌ ఐకాన్‌గా మారాడు విజయ్‌ దేవరకొండ. యువ కథానాయకుల్లో ఆయనకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇప్పుడంటే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకొన్నాడు కాబట్టి వరుసగా అవకాశాలు వెల్తువెత్తుతున్నాయి కానీ... తొలినాళ్లలో మాత్రం ఆయన ఫొటో ఆల్బమ్‌లు పట్టుకొని అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగారు. చిన్న చిన్న పాత్రల్లో నటించే అవకాశం వస్తే వాటిని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌కి పునాదులు వేసుకొన్నాడు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’లో విజయ్‌ ఓ చిన్న పాత్రలో కనిపిస్తాడు. అందులో ఓ కథానాయకుడిగా నటించిన సుధాకర్‌ కోమాకులతో ఉన్న అనుబంధం, ఆయన చేసిన ఫొటోషూట్‌ గురించి విజయ్‌ దేవరకొండ ఒక వేడుకలో ఇలా చెప్పుకొచ్చారు. ‘‘శేఖర్‌ కమ్ముల ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’లో ఓ వేషం కోసమని ఆయన కార్యాలయానికి వెళ్లాను. అక్కడే సుధాకర్‌ కోమాకుల కలిశాడు. నాతోపాటు తనూ ఎంపికయ్యాడు. ఇద్దరం స్నేహితులుగా బాగా కలిసిపోయాం. తనకి ఫొటోగ్రఫీ హాబీ. చాలా బాగా తీస్తాడు ఫొటోలు. ఓసారి నేనెంత వద్దన్నా వినకుండా నా ఫొటోసెషన్‌ చేశాడు. పిచ్చిపిచ్చిగా, పొడుగాటి జుట్టుతో వున్న నన్ను పలు రకాల భంగిమల్లో ఫొటోలు తీసి, ఆల్బమ్‌ చేసిచ్చాడు. ‘ఈ ఫొటోల్ని పంపితే వేషం తన్నుకుంటూ వస్తుంది’ అనేవాడు. ఇంతగా చెప్పాడు కదా, చూద్దామని ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా వాళ్లకి సుధాకర్‌ తీసిన ఫొటోల్నే పంపా. వాడి మాట మహిమో, ఏమోగానీ... వాడన్నట్టే అందులో నాకొక మంచి వేషం వచ్చింది. ఆ సినిమాతో నాకు బాగా పేరొచ్చింది. ఆ తర్వాత ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాలతో కథానాయకుడిగా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యా’’ అంటూ తన తొలి రోజుల్ని గుర్తు చేసుకొన్నాడు విజయ్‌. త్వరలోనే ఆయన ‘గీత గోవిందం’ చిత్రంతో సందడి చేయబోతున్నాడు.


© Sitara 2018.
Powered by WinRace Technologies.