
‘సైరా’ సందడి నుంచి ప్రేక్షకులు ఇంకా బయటకే రాలేదు.. చిరంజీవి వారికి మరో కానుక అందించేశారు. తాజాగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకోని తన 152వ చిత్రాన్ని మొదలుపెట్టేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిరు సతీమణి సురేఖ క్లాప్ నిచ్చారు. కొరటాల గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా ఓ సామాజిక సందేశం నేపథ్యంలోనే సాగుతుందట. చిరు పాత్ర మునుపెన్నడూ చూడనంత కొత్తగా ఉండబోతుంది. ఇందులో చరణ్ కూడా ఓ కీలక పాత్రను పోషించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ, ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చిత్ర నిర్మాణంలో కొణిదెల ప్రొడక్షన్స్‌తో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కూడా భాగం అవుతోంది. త్వరలో సెట్స్‌పైకి వెళ్లబోయే ఈ చిత్రాన్ని వచే వేసవి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.