రామ్‌ ‘రెడ్‌’ షురూ!

కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రామ్‌ నటిస్తున్న చిత్రం ‘రెడ్‌’. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. తాజాగా బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి,నిర్మాత ఛార్మి హాజరయ్యారు. హీరో రామ్‌పై తొలిక్లాప్‌నిచ్చారు పూరీ. కృష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభంకానుంది. కథానాయిక, సాంకేతిక బృందం వివరాలు కొద్ది రోజుల్లో తెలియనున్నాయి. ఇప్పటికే విడుదలైన రామ్‌ లుక్‌ చూస్తుంటే యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుబోతున్న చిత్రంలా అనిపిస్తుంది. కిశోర్‌-రామ్‌ కలయికలో వచ్చిన ‘నేను శైలజ’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాలు మంచి విజయం అందుకున్నాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడంతో అందరిలో ఆసక్తి పెరిగింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.