రాజమౌళి అడిగారు.. నేను చేస్తానన్నా..

‘బాహుబలి’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్నారు. కథానాయికలు ఎవరన్నది ఖరారు కావాల్సి ఉంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని కనిపించబోతున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో తాను నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజమేనని క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను దర్శకత్వం వహించిన ‘నాడోడిగల్‌’ చూసి రాజమౌళి సర్‌ నాకు ఓ పెద్ద సందేశం పంపారు. అప్పటి నుంచి నేను ఆయనతో టచ్‌లో ఉన్నాను. ఈమధ్య ఆయన నన్ను తన ఇంటికి ఆహ్వానించారు. తన కుటుంబ సభ్యుల్ని పరిచయం చేశారు. ఆ సమయంలోనే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా గురించి చెప్పారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంది చేస్తారా? అని అడిగారు. నేను క్షణం కూడా ఆలోచించకుండా వెంçనే ఒప్పేసుకున్నా. అయితే ముందు సినిమా స్క్రిప్ట్‌ చదవాలని చెప్పారు. నేను సరేనన్నాను’’ అని ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్ర రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ దీన్ని నిర్మిస్తోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.