కుర్రాడి ‘షార్ట్‌టెంపర్‌’

నవీన్‌ కథానాయకుడుగా పరిచయమవుతున్న చిత్రం ‘షార్ట్‌ టెంపర్‌’. రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్‌.ఆర్‌.ఆర్‌ నిర్మాత. ఆదిత్య ఓమ్‌ మరో కథానాయకుడు. సుభాంగి పంత్, షాలిని చౌహాన్‌ కథానాయికలు. శుక్రవారం హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘మా’ అధ్యక్షుడు శివాజిరాజా కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. బెక్కెం వేణుగోపాల్‌ క్లాప్‌నిచ్చారు. విలేకర్ల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రేమ, యాక్షన్, సస్పెన్స్‌ అంశాలతో కూడిన ఓ కల్పిత కథ ఇది. ఒక కుర్రాడు తనకున్న షార్ట్‌ టెంపర్‌ వల్ల ప్రేమలో ఎలాంటి సమస్యల్ని ఎదుర్కున్నాడనేది ఆసక్తికరం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కథానాయకుడు నవీన్‌... స్ట్రీట్‌ ఫైటర్‌గా కనిపిస్తాడు. ఐదు పాటలకీ డేవిడ్‌ ఆహ్లాదకరమైన స్వరాల్నిచ్చారు. ముఖ్యమైన పాత్రలో అలీ, విభిన్నమైన పాత్రలో ఆదిత్య ఓమ్‌ కనిపిస్తార’’న్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఇందులోని యాక్షన్‌ దృశ్యాలను బ్యాంకాక్‌లో ఇరవై రోజులపాటు చిత్రిస్తాం. మార్చి ఆఖరు నుంచి జరిపే రెండు షెడ్యూల్స్‌తో చిత్రాన్ని పూర్తి చేస్తామ’’న్నారు. నవీన్‌ మాట్లాడుతూ ‘‘నేను పోషిస్తున్న పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందాను’’ అన్నారు. ‘‘అన్ని వర్గాలకీ నచ్చే అంశాలతో తెరకెక్కుతోన్న చిత్రమ’’ని నాయికలు చెప్పారు. ‘‘ప్రేక్షకుల్ని నవ్వించే పాత్రల్ని పోషిస్తున్నామ’’ని తాగుబోతు రమేష్, రచ్చరవి, గీతాసింగ్‌ చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:జగన్‌.ఎ.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.