రైతన్నల గొంతుక.. ‘అన్నదాత సుఖీభవ’
సామాజిక ఇతివృత్తాలతో సినిమాలు తెరకెక్కిస్తూ చిత్రసీమలో పీపుల్స్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు ఆర్‌.నారాయణ మూర్తి. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అన్నదాతా సుఖీభవ’. స్వరకర్త కూడా ఆయనే. అనేక అవరోధాల అనంతరం ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర పాటల విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీలను యలమంచిలి శివాజీ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారి సంఖ్య బాగా తగ్గిపోతోంది. రైతు కష్టానికి తగిన ఆదాయం దక్కడం లేదు. అలాంటి రైతుల సమస్యలపై సినిమా తీసిన ఆర్‌.నారాయణమూర్తి అభినందనీయుడు’’అని అన్నారు. గీత రచయిత సుద్దాల అశోక్‌ తేజ మాట్లాడుతూ ‘‘తనదైన ట్రెండ్‌ను కొంతమేర మార్చుకుని నారాయణ మూర్తి ఈ సినిమా తీశాడా, అనిపించింది. ఎప్పటిలాగే నేనిందులో మంచి గీతాలు రాశా’’ అన్నారు. ప్రజా గాయకుడు, రచయిత గోరేటి వెంకన్న మాట్లాడుతూ ‘‘నారాయణమూర్తి తన ప్రతి సినిమాలోనూ నాతో పాటలు రాయిస్తుంటాడు. గద్దరన్న పాడుతుంటాడు. ఒకోసారి నాతోనూ పాడిస్తుంటాడు. ఈ రెండూ ఇందులో జరిగాయ’’న్నారు. ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘‘రైతులకి గిట్టుబాటు ధర దక్కాలనీ, ఆత్మహత్యలు చేసుకోకుండా ఆత్మగౌరవంతో బతకాలనీ, ఇందుకోసం స్వామినాధన్‌ కమీషన్‌ సిఫార్సులను కేంద్రప్రభుత్వం అక్షరాలా అమలు పరచాలని కోరుతూ ఈ సినిమాని తీశా. రైతుల రుణాలు వంటి పలు సమస్యల గురించి చర్చించాం. ఈ నేపథ్యంలో దేశంలోని ఏ ముఖ్యమంత్రులు రైతుల కోసం చేయని మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరధ, రైతు బంధు పధకాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. అమలుపరుస్తున్నారు. ఆయన నిజంగా రైతు బంధు. ఆయనలా ఇతర ముఖ్యమంత్రులంతా రైతుల పధకాలను ప్రవేశపెట్టాలి. ఈనెల 18న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామ’’న్నారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.