‘జెస్సీ’ భయపెడుతుంది

అతుల్‌ కులకర్ణి, కబీర్‌ దుహన్‌ సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘జెస్సీ’. వి.అశ్వినికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్వేతాసింగ్‌ నిర్మాత. చిత్రాన్ని మార్చి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘రెండేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. హారర్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందించాం’’ అన్నారు. ఆషిమా నర్వాల్‌ మాట్లాడుతూ ‘‘నా తొలి సినిమాగా విడుదల కావల్సిన సినిమా ఇది. కొన్ని కారణాలతో ఆలస్యమైంది. మంచి కథతో రూపొందిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రని పోషించా’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘మా ‘జెస్సీ’ భయపెడుతుంది, థ్రిల్‌కి గురిచేస్తుంది. పీవీఆర్‌ సినిమాస్‌ ద్వారా ఈ చిత్రం విడుదలవుతోంది’’ అన్నారు. నటుడు అభినవ్‌ గోమటం మాట్లాడుతూ ‘‘ఇదొక సైకలాజికల్‌ హారర్‌ థ్రిల్లర్‌. భిన్నమైన పాత్ర చేశా. అశ్విన్‌ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది’’ అన్నారు. నటుడు విమల్‌కృష్ణ మాట్లాడుతూ ‘‘ఇందులో ఇద్దరు తోబుట్టువుల మధ్య సెంటిమెంట్‌ మెప్పిస్తుంది’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం అందించడాన్ని ఎంతగానో ఆస్వాదించానన్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.