సినీ రథ సారథుల రజతోత్సవం

‘‘సినిమా మొదలైనప్పట్నుంచి... పూర్తయ్యే వరకు ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వాళ్ల సంక్షేమం కోసం నిర్వహించబోతున్న వేడుకకి సినీ పరిశ్రమ మొత్తం అండగా ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు దిల్‌రాజు, కె.ఎస్‌.రామారావు, సి.కల్యాణ్‌. తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబరు 8న హైదరాబాద్‌లో ‘సినీ రథ సారథుల రజతోత్సవం’ పేరుతో ఓ వేడుకని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ‘‘నిర్మాతలుగా తెరపైన మా పేరే ప్రముఖంగా పడినా కష్టం ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌లదే. వాళ్ల సంక్షేమం పరిశ్రమకి ఎంతో అవసరం. వేడుకకి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామ’’న్నారు కె.ఎస్‌.రామారావు. నిర్మాతల మండలి తరఫున సహకారం ఉంటుందని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌ అన్నారు.కార్యక్రమంలో ‘మా’ అధ్యక్షుడు వి.కె.నరేష్‌, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌, ‘మా’ ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్‌, కోశాధికారి రాజీవ్‌ కనకాల, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ నాయకులు అమ్మిరాజు, ఆర్‌.వెంకటేశ్వరరావు, సతీష్‌, వివేక్‌ తదితరులు పాల్గొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.