వినోదాన్ని అత్యున్నత స్థాయిలో చూపించారు

‘‘సంక్రాంతికి నా నుంచి వచ్చిన ప్రతి చిత్రాన్నీ ప్రేక్షకులు ఆదరించారు. ఈసారి వస్తున్న ‘ఎఫ్‌ 2’ కూడా అలానే విజయవంతమవుతుందన్న నమ్మకం ఉంద’’న్నారు వెంకటేష్‌. ఆయన వరుణ్‌తేజ్‌తో కలసి నటించిన చిత్రమిది. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. దిల్‌రాజు నిర్మాత. అనిల్‌ రావిపూడి దర్శకుడు. 12న విడుదల అవుతోంది. గురువారం హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘ఓ కథ వింటున్నపప్పుడు ప్రేక్షకుడిలానే వింటా. దర్శకుడితో స్నేహితుడిలా అభిప్రాయాలు పంచుకుంటా. అనిల్‌ రావిపూడిలో ఏదో ఓ మాయ ఉంది. తను వినోదాన్ని అత్యున్నత స్థాయిలో చూపించాడు. సాధారణంగా కామెడీ పండించడం చాలా కష్టం. ఒకట్రెండు టేకుల్లో సీన్‌ ఓకే అయిపోవాలి. లేదంటే మళ్లీ రాదు. ఓ సీన్‌ చేశాక అనిల్‌ సహాయ దర్శకులతో చర్చించేవాడు. దాంతో ‘మళ్లీ చేయమంటారేమో. అయిపోయాన్రా నేను’ అనే భయం వేసేది’’ అన్నారు. వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ ‘‘తొలిసారి ఓ మాస్‌ పాత్ర ప్రయత్నించా. ఈ సినిమా షూటింగ్‌ ఎలా మొదలైందో, ఎలా అయిపోయిందో అర్థం కావడం లేదు. అనిల్‌ రూపంలో ఓ మంచి స్నేహితుడు దొరికాడు. మా ఇంట్లో రాజేంద్ర ప్రసాద్‌గారు నటించిన సినిమా సీడీలు ఉంటాయి. నవ్వుకోవాలని అనిపిస్తే ఆయన సినిమాలు చూసేవాణ్ని. అలాంటి నటుడితో కలసి పనిచేయడం ఆనందంగా ఉంది. వెంకటేష్‌గారి ‘ఇంట్లో ఇల్లాలు - వంటింట్లో ప్రియురాలు’, ‘వాసు’ సినిమాల్లో నన్ను నటించమని అడిగారు. కానీ కుదర్లేదు. ముచ్చటగా మూడోసారి వెంకటేష్‌గారితో నటించే అవకాశం వచ్చింద’’న్నారు. తమన్నా మాట్లాడుతూ ‘‘కొన్ని సినిమాలు మైలురాళ్లుగా మిగిలిపోతాయి. అలాంటి సినిమా ఇది. ‘ఊపిరి’ తరవాత ఈ సినిమాలో డబ్బింగ్‌ చెప్పుకున్నాను.చాలా పార్శ్వాలున్న పాత్ర దక్కింది. ‘ఎఫ్‌ 3’ తీస్తే బాగుంటుంది. మళ్లీ మేమంతా కలసి పనిచేసే అవకాశం వస్తుంద’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఎఫ్‌ 2’ని 80 శాతం కామెడీతోనే నింపేశాం. టైమింగ్‌ ఉన్న గొప్ప నటులు ఈ సినిమాలో పనిచేశారు. వెంకీ - తమన్నా మధ్య ఉండే కెమిస్ట్రీ, కామెడీని ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారు. వరుణ్‌ తెలంగాణ యాసతో ఆకట్టుకుంటాడ’’న్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఓ సినిమా సిద్ధం అవ్వడానికి 24 విభాగాలూ పూర్తిగా కష్టపడాల్సిందే. ఈ సినిమాకీ మేమంతా అలానే కష్టపడ్డాం. ‘కలియుగ పాండవులు’తో వెంకటేష్‌గారి అభిమానిని అయ్యా. వారం రోజుల ముందే టికెట్‌ బుక్‌ చేసుకుని అభిమానిగా చూశా. ఆయనతో రెండోసారి పనిచేసే అవకాశం దక్కింది. కథ విన్న వెంటనే ‘నా పాత్ర ఏంటి’ అని అడక్కుండా ఒప్పుకున్నాడు వరుణ్‌. అనిల్‌ దగ్గర ఓ మ్యాజిక్‌ ఉంది. పూర్తి స్క్రిప్టు లేకుండా సినిమా తీయడానికి నేను ఒప్పుకోను. అలాంటి నన్ను కేవలం సన్నివేశాలు చెప్పి ఒప్పించేస్తాడ’’న్నారు. ఈ కార్యక్రమంలో మెహరీన్‌, రాజేంద్ర ప్రసాద్‌, శిరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.