‘సువర్ణ సుందరి’ మాయ చేస్తుంది
                                   

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, ఇంద్ర, రామ్‌ ప్రధానపాత్రధారులుగా నటించిన చిత్రం ‘సువర్ణ సుందరి’. ఎం.ఎస్‌.ఎన్‌. సూర్య దర్శకుడు. ఎం.ఎల్‌. లక్ష్మి నిర్మాత. హైదరాబాద్‌లో ప్రచారచిత్రాన్ని ప్రముఖ దర్శకులు బి.గోపాల్, తమ్మారెడ్డి భరద్వాజ సంయుక్తంగా విడుదల చేశారు. బి.గోపాల్‌ మాట్లాడుతూ ‘‘ప్రచారచిత్రం చూస్తుంటే చిత్రబృందం తపన కనిపిస్తోంది. వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాల’’న్నారు. ‘‘ఈ చిత్రం పూర్తిగా కొత్తకోణంలో సాగబోతోందని ప్రచార చిత్రాలు చూడగానే అర్థమవుతోంద’’న్నారు తమ్మారెడ్డి భరద్వాజ. దర్శకుడు మాట్లాడుతూ ‘‘స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే చిత్రమిది. విజువల్‌ ఎఫెక్ట్‌కి ప్రాధాన్యం ఉంది. ప్రధాన పాత్రధారుల నటన, సాంకేతిక బృందం పనితనం ఈ చిత్రాన్ని నిలబెడతాయి. మూడు తరాల కథ ‘సువర్ణ సుందరి’ చిత్రాన్ని నడిపిస్తుంద’’న్నారు. పూర్ణ మాట్లాడుతూ ‘‘నా పాత్ర రెండు కోణాల్లో ఉంటుంది. కథలో మలుపులు ఆకట్టుకుంటాయ’’ంది. ‘‘కత్తి యుద్ధాల కోసం ప్రత్యేకమైన తర్ఫీదు పొందాను. ఆ పోరాటాలు థ్రిల్‌ కలిగిస్తాయ’’ని సాక్షి చౌదరి చెప్పింది. ‘‘టీజర్‌కి మంచి స్పందన లభించింది. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామ’’ని నిర్మాత ఎం.ఎల్‌. లక్ష్మి తెలిపారు.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.