మనసుకు నచ్చిన ‘మల్లేశం’

‘‘ఏదైనా సాధించాలనే ప్రయత్నంలో ఒడిదుడుకులు రావడం సహజం. అలాంటప్పుడు ఆత్మహత్యలు చేసుకోకూడదు. మరోసారి ప్రయత్నించాలి. విజయం దక్కేంత వరకూ పోరాడాలన్న సందేశాన్నిచ్చింది ‘మల్లేశం’. ఈ చిత్రం నా మనసుకి నచ్చింద’’న్నారు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌. ప్రియదర్శి, అనన్య, చక్రపాణి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మల్లేశం’. రాజ్‌.ఆర్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని శనివారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ ‘‘సినిమా హృద్యంగా ఉంది. ఓ పాటలో సామాన్యుడి ప్రతిభని చక్కగా ఆవిష్కరించారు. అంతరించిపోతున్న చేనేత కళాకారుల నైపుణ్యానికి పెద్ద పీట వేసిన చిత్రమిది. తెలంగాణ ప్రభుత్వం చేనేత కళాకారుల కోసం చాలా కార్యక్రమాలు చేపట్టింది. బడ్జెట్‌లో రూ.వందల కోట్లు కేటాయించింది. ఇక ముందూ వాళ్ల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తాం. ఈ చిత్రానికి వినోద పన్ను మినహాయించేలా కృషి చేస్తా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో డి.సురేష్‌బాబు, శ్రీ అధికారి, లక్ష్మణ్‌ ఏలే, పెద్దింటి అశోక్‌ బాబు, వెంకట్‌ సిద్ధారెడ్డి, బి.నర్సింగరావు, బాలు తదితరులు పాల్గొన్నారు.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.