అందరికి షాక్‌!

శ్రీకాంత్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆపరేషన్‌ 2019’. మంచు మనోజ్, సునీల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్నారు. అలివేలు నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో సునీల్‌పై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ పాటని ర్యాప్‌రాక్‌ షకీల్‌ స్వరపరచగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చారు. భాను నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది చిత్రబృందం. కథానాయకుడు శ్రీకాంత్‌ మాట్లాడుతూ ‘‘రాజకీయం నేపథ్యంలో సాగే చిత్రమిది. ‘ఆపరేషన్‌ దుర్యోధన’ తర్వాత మళ్లీ ఓ కొత్త గెటప్‌లో చేశాననే అనుభూతినిచ్చింది. కరణం బాబ్జి రాసుకొన్న కథ, సంభాషణలు చాలా బాగున్నాయి. మంచు మనోజ్, సునీల్‌ ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. సునీల్‌ మాట్లాడుతూ ‘‘నేనీ చిత్రంలో వచ్చే సందర్భం అందరికీ షాకింగ్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘చెన్నైలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నా. మనోజ్‌ కథ వినగానే ‘పెదరాయుడు’లో రజనీకాంత్‌ పాత్రలా ఉంది, చేస్తా అన్నారు. ‘ఆపరేషన్‌ దుర్యోధన’ తరహా పాత్రలో శ్రీకాంత్‌ ఇందులో కనిపిస్తార’’న్నారు దర్శకుడు. యజ్ఞశెట్టి, దీక్షాపంత్, హరితేజ, సుమన్, కోట శ్రీనివాసరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకట్‌ప్రసాద్‌.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.