‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’

ర్‌.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈనెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘ప్రజలకు ఉపయోగపడే కథా వస్తువుని ఎంచుకుని సినిమాగా మలుస్తాడు నారాయణమూర్తి. తన చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి చిత్రాల్ని తాను మాత్రమే తీయగలడు. ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ చూస్తుంటే రూ.వంద కోట్ల విలువైన సినిమాని చూసిన అనుభూతి కలిగింద’’న్నారు. నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘సామాజిక స్పృహ కలిగిన చిత్రాలు ఈమధ్య కాలంలో రావడం లేదు. ఆ లోటుని తీర్చిన చిత్రమిది. అంకిత భావంతో సినిమాలు తీస్తారు నారాయణమూర్తి. ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్‌’’ అన్నారు. పోకూరి బాబూరావు మాట్లాడుతూ ‘‘నారాయణ మూర్తి చిత్రాల్లో పాటలు బాగుంటాయి. ప్రజాకవులు ప్రజల్లో మమేకమై గీతాలు రాస్తారు. అందుకే అవి అంతగా నిలిచిపోతాయ’’న్నారు. ‘‘ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ఈ చిత్రం అద్దం పట్టింద’’న్నారు జెమిని కిరణ్‌. ‘‘ప్రజాస్వామ్యం ధన స్వామ్యంగా మారిపోయింది. ఎన్నికలంటేనే రూ.వేల కోట్ల వ్యాపారం అయిపోయింది. ఈ రాజకీయం మారాలని చెప్పే చిత్రమిద’’న్నారు నారాయణమూర్తి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.