ప్రేమికుడి పోరాటం

నెమలి అనిల్, విరాజ్, సుబాంగి పంత్‌ నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘రావే నా చెలియా’. ఎన్‌. మహేశ్వర రెడ్డి దర్శకుడు. నెమలి సురేష్, నెమలి శ్రావణ్‌ నిర్మాతలు. ఈ సినిమా లోగో, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో నిర్మాత రాజ్‌కందుకూరి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటైన విలేకర్ల సమావేశంలో రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ ‘‘టైటిల్‌ బాగుంది. ఇప్పుడొస్తోన్న చిన్న సినిమాలలో ఏ మాత్రం కథాబలం వున్న చిత్రమయినా ప్రేక్షకాదరణను పొందుతోంది. ఆ పరంపరలో ఈ సరికొత్త ప్రేమకథాచిత్రమూ చేరాలన్నా’’రు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ముక్కోణపు ప్రేమకథాచిత్రం. తను కోరిన అమ్మాయి చేయి అందుకోవడానికి ప్రేమికుడు చేసిన పోరాటం నేపథ్యంలో నడుస్తుంది. ఐదు పాటలు అలరిస్తాయి. సినిమాకి సంగీతం, ఛాయాగ్రహణం ప్రాణం పోశాయి’’ అని అన్నారు. ‘‘నవయువతరం ప్రేమ విషయాల్లో అనుసరిస్తోన్న పోకడలకి ప్రతిరూపంగా నిలుస్తుంద’’న్నారు నెమలి అనిల్‌. ‘‘ఈ ప్రేమకథని ఎలివేట్‌ చేసేలా ఎం.ఎం. కుమార్‌ స్వరాల్నిచ్చార’’న్నారు విరాజ్‌. నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులకి నచ్చేలా దర్శకుడు మలిచాడు. నిర్మాణానంతర పనులను నిర్వహిస్తున్నాం. వచ్చే నెలలో సినిమాని విడుదల చేస్తామ’’ని చెప్పారు. ఇంకా సుబాంగి, కృష్ణతేజ, నెమలి శ్రావణ్, విజయ్‌ ఠాగూర్‌ తదితరులు పాల్గొన్నారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.