చిత్రపురిలో ఇళ్లు దక్కని వారి గొంతుక నేనవుతా..

‘‘చిత్రపురిలో ఇళ్లు దక్కని వారికి భరోసాగా నిలుస్తాన’’న్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. అందరికీ వినోదాన్ని పంచే సినిమాలో భాగమైన వారికి సొంతింటి కల నెరవేరే క్రమంలో చిత్రపురి కాలనీలో ఎదరవుతున్న సమస్యలను సామరస్యపూర్వంగా పరిష్కరించే దిశగా ముందుకెళ్తామని ఆయన స్పష్టంచేశారు. బుధవారం హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో చిత్రపురి సాధన సమితి సభ్యులు పవన్‌ను కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. జూనియర్‌ ఆర్టిస్టులు, కాస్ట్యూమర్లు, ఫైటర్లు.. ఇలా సినిమా రంగంలోని 24 క్రాఫ్ట్స్‌లో పనిచేస్తున్న తమకు ఇళ్లు దక్కడంలేదని, చిత్ర పరిశ్రమకు సంబంధంలేని వారు ప్లాట్స్‌ దక్కించుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే, ప్రశ్నించినవారికి పనిలేకుండా చేస్తున్నారని పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై పవన్‌ స్పందిస్తూ.. చిత్రపురిలో ఇళ్లు దక్కక వేదనకు గురవుతున్న వారికి అండగా నిలుస్తానన్నారు. వారి గొంతుకను తాను విన్పిస్తానని భరోసా ఇచ్చారు. ఈ అంశంపై ఎన్‌.శంకర్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, తమ్మారెడ్డి భరద్వాజతో చర్చిస్తానన్నారు. హిందీ సినిమాకు ముంబయి కేంద్రంగా ఉన్నట్టుగానే.. తెలుగు చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉందని.. అందువల్ల చిత్రపురిలో తెలుగు సినిమా రంగంలోని వారి సొంతింటి కల నెరవేరాలని అన్నారు. చిత్రపురిలో ఇళ్లకు సంబంధించి జనసేన పార్టీ కూడా అండగా ఉంటుందని పవన్‌ వారికి భరోసా ఇచ్చారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.