రాములమ్మలా పేరు సంపాదించాలి

తేజస్‌ కంచర్ల, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించిన చిత్రం ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’. శంకర్‌ భాను దర్శకుడు. సి.కల్యాణ్‌ నిర్మాత. మంగళవారం హైదరాబాద్‌లో ప్రచార చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినాయక్‌ మాట్లాడుతూ ‘‘డబ్బులు కాదు, అభిరుచి ముఖ్యమని నమ్మి సినిమాలు తీసే వ్యక్తి సి.కల్యాణ్‌. కథ బాగుంటే ఎంతైనా ఖర్చు పెడతారు. భాను నా స్నేహితుడు. నాతో పాటే కలిసి పనిచేశాడు. ప్రతిభావంతుడైన తనకు ఈ సినిమాతో మంచి విజయం దక్కుతుందనిపిస్తోంది. విజయశాంతిలా పాయల్‌రాజ్‌పుత్‌ మంచి పేరు తెచ్చుకోవాల’’న్నారు. ‘‘టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. యుక్త వయసులో ఉన్న ఓ అమ్మాయి జీవితాన్ని ఆస్వాదించే సమయంలో, తన కోరికల్ని పక్కన పెట్టి ఊరు కోసం ఏం చేసిందో హృదయాన్ని తాకేలా చూపిస్తున్నాం. పాయల్‌ చాలా బాగా నటించింది. రథన్‌ సంగీతం ఆకట్టుకుంటుంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామ’’న్నారు నిర్మాత. పాయల్‌ మాట్లాడుతూ ‘‘ఆర్‌ఎక్స్‌ 100’తో నా జీవితం మొత్తం మారిపోయింది. ఈ సినిమాలో నా పాత్ర కొత్త కోణంలో సాగుతుంద’’న్నారు. ‘‘పాయల్, తేజస్‌ జంట ఆకట్టుకుంటుంది. సాంకేతిక పనితనం కూడా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుంద’’న్నారు దర్శకుడు.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.