ఈ ‘కౌసల్య’.. నాకెంతో నచ్చింది..

‘‘అమ్మాయిలు తమని తాము ఎలా నిరూపించుకుంటున్నారో ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రంలో ఎంతో చక్కగా చూపించార’’న్నారు భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు. ఐశ్వర్యా రాజేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని తన బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, చాముండేశ్వరినాథతో కలిసి వీక్షించారు పీవీ సింధు. అనంతరం ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ.. ''సినిమా చూశాను. చాలా బాగుంది. అమ్మాయిలు తమను తాము ఎలా నిరూపించుకున్నారో చక్కగా చూపించారు. అదే విధంగా రైతుల సమస్యలను గుర్తించాలని ఈ సినిమాలో చూపించారు. మనం ఈరోజు తింటున్నామంటే కారణం రైతులే. అమ్మాయిలు నమ్మకంతో ముందుకొచ్చి క్రికెట్ ఆడటం అనే విషయంతో పాటు రైతుల విలువేంటి? అనే మెసేజ్‌ను ఈ చిత్రం ద్వారా ఇచ్చారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిజం చేయడానికి కౌసల్య ఎంత కష్టపడిందో ఈ సినిమాలో మనం చూడొచ్చు. చాలా మంచి మెసేజ్‌, ఎమోషన్స్ ఉన్న సినిమా. ఐశ్వర్యా రాజేష్ చాలా నేచురల్ నటించడమే కాదు.. చాలా హార్డ్‌వర్క్ చేసింది'' అన్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.