
‘‘వాణిజ్య విజయంతో పాటు విశ్లేషకుల ప్రశంసలు కూడా మా ‘రాక్షసుడు’కి లభించాయి. ఇలాంటి విజయం కోసమే ఎప్పట్నుంచో ఎదురు చూశాను’’అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. అనుపమ పరమేశ్వరన్ నాయిక. రమేష్ వర్మ దర్శకుడు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. ఈ సందర్భంగా చిత్రబృందం ఆదివారం హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించింది. నిర్మాత మాట్లాడుతూ ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘రాక్షసుడు’ పేరే వినిపిస్తోంది. చూసిన ప్రతి ఒక్కరూ సినిమా బాగుందని, థ్రిల్‌కి గురయ్యామని చెబుతున్నారు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులంతా ఈ సినిమాకి కనెక్ట్ అయ్యామని చెబుతున్నార’’న్నారు. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘అందరూ మనసు పెట్టి పని చేశారు. అందుకే ఈ విజయం దక్కింది’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ ‘‘ఒక రీమేక్ సినిమాని ఎలా చేయాలో అలాగే తెరకెక్కించారు. సాయిశ్రీనివాస్ నిజాయతీగా నటించార’’న్నారు. అమలాపాల్ మాట్లాడుతూ ‘‘ఇలాంటి సినిమాని రీమేక్ చేయాలంటే ధైర్యం ఉండాలి. రమేష్ వర్మ బాగా తీశారు. సాయి శ్రీనివాస్ పాత్రకి తగ్గట్టు నటించాడు’’ అన్నారు. ‘‘తమిళంలో ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు సాయిశ్రీనివాసే కనిపించారు. నా ఆలోచనలకి తగ్గట్టుగానే ఆయన పాత్రలో ఒదిగిపోయార’’న్నారు దర్శకుడు. కార్యక్రమంలో అభిషేక్ నామా, భరత్ చౌదరి, శరవణన్, వినోద్ సాగర్, వినోదిని, అభిరామి, మల్టీ డైమన్షన్ వాసు, వెంకట్ సి.దిలీప్, అమర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.