రామ్‌ లేకుండా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ లేడు

‘‘తొలిసారి రామ్‌తో కలిసి పనిచేశా. తనలో ఉత్సాహం తరగనంత ఉంది. తనని వాడుకున్నోళ్లకి వాడుకున్నంత. నేను నా చేతనైనంత వాడా. ప్రేక్షకుల మదిలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’గా నిలిచిపోతాడు’’ అన్నారు పూరి జగన్నాథ్‌. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. రామ్‌ కథానాయకుడిగా నటించారు. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ కథానాయికలు. పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మాతలు. చిత్రం ఈనెల 18న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా విడుదలకి ముందస్తు వేడుకని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘‘రామ్‌ గొప్ప నటుడు. తను మాట్లాడిన తెలంగాణ యాస సినిమాకే హైలెట్‌. మణిశర్మ ఈ సినిమాకి మూలస్తంభంలా నిలిచార’’న్నారు. రామ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం పనిచేసిన ఆరు నెలల కాలం నా జీవితంలోనే అత్యుత్తమం. నిధి అగర్వాల్‌ తన పాత్రలో ఒదిగిపోయింది. నభా నటేష్‌ గడుసైన పాత్రలో కనిపించింది’’ అన్నారు. ‘‘రామ్‌ లేకుండా ఇస్మార్ట్‌ శంకర్‌ లేడు. మరొకరు చేయలేరనేలా నిధి, నభా వారి పాత్రల్లో ఒదిగిపోయారు. మేం తొలి కాపీ చూశాం. సినిమా అప్పుడే విజయవంతమైనందన్న అనుభూతికి గురయ్యాం’’ అన్నారు ఛార్మి. ‘‘పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎదురు చూశా. ఆ అవకాశం ఇంత తక్కువ సమయంలో రావడం ఆనందగా ఉంది. రామ్‌, నభాలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’’ అని చెప్పింది నిధి అగర్వాల్‌. నభా నటేష్‌ మాట్లాడుతూ ‘‘అందమైన పాత్ర రాసి... అందులో నటించే అవకాశం నాకు ఇచ్చారు పూరి జగన్నాథ్‌’’ అన్నారు. కార్యక్రమంలో నృత్య దర్శకురాలు అనీతోపాటు చిత్రబృందం పాల్గొంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.