వెజిటేరియన్‌గా కనిపించే నాన్‌ వెజిటేరియన్‌

‘‘రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. నభా నటేషా, నిధి అగర్వాల్‌ కథానాయికలు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. ఆదివారం రాత్రి వరంగల్‌లో ‘ఇస్మార్ట్‌ బోనాలు’ పేరుతో ఓ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘‘హైదరాబాదీ ఇస్మార్ట్‌ రౌడీ బుర్రలో పోలీసోళ్లు సిమ్‌ కార్డు పెట్టారు. అదెందుకో సినిమా చూసి తెలుసుకోవాలి. వినోదాత్మక కథ ఇది. రామ్‌ నటనే ప్రధాన ఆకర్షణ. ‘టెంపర్‌’ తరవాత నాకు మంచి హిట్టు పడలేదు. మంచి ఆకలితో ఉన్నప్పుడు రామ్‌ దొరికాడు. వెజిటీరియన్‌ ముసుగులో ఉన్న నాన్‌ వెజిటేరియన్‌ రామ్‌. తను రామ్‌ పోతినేని కాదు.. రామ్‌ చిరుతపులి. రామ్‌కి సినిమా తప్ప మరో ధ్యాస లేదు. పార్టీలూ, ఫ్రెండ్స్‌ అంటూ ఉండవు. సహాయ దర్శకుడు పిలవకముందే షాట్లో దూకుతాడు. ప్రతి షాట్‌లో వంద శాతం ప్రతిభ చూపించాలనుకుంటాడు. మణిశర్మ మంచి పాటలు ఇచ్చారు. భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్‌ మంచి సాహిత్యం అందించారు. బోనాల పాట మరింత హిట్టయ్యింది. బోనాల సమయంలోనే మా సినిమా విడుదల అవ్వడం ఆనందంగా ఉంది’’ అన్నారు. నభా నటేషా మాట్లాడుతూ ‘‘ఈ సినిమా పక్కా మాస్‌. ఎంత మాస్‌ అంటే రొమాన్స్‌లో కూడా యాక్షన్‌ ఉంటుంది. నాకోసం ఇంత మంచి పాత్ర రాసి, నమ్మకంగా నాకు ఇచ్చినందుకు పూరిసార్‌కి కృతజ్ఞతలు. రామ్‌ సహకారం మర్చిపోలేను’’ అంది. నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘రామ్‌తో డ్యాన్స్‌ చేయడం కష్టం. రెండు రోజులు రిహార్సల్స్‌ చేసి మరీ డ్యాన్స్‌ చేయాల్సి వచ్చింద’’న్నారు. ఛార్మి మాట్లాడుతూ ‘‘ఈనెల 18న ఈ చిత్రం విడుదల అవుతోంది. ట్రైలర్‌లో కొంచెమే చూపించాం. సినిమాలో చాలా ఉంది. థియేటర్లో విజిల్స్‌ పడతాయి. నవ్వుకుంటూ బయటకు వస్తారు. పూరి ఈ సినిమాలో చాలా మంచి డైలాగులు రాశార’’న్నారు. రామ్‌ మాట్లాడుతూ ‘‘మణిశర్మ చాలా మంచి బాణీలిచ్చారు. ఏ పాట ఎక్కువ బాగుందో చెప్పలేకపోతున్నా. అన్ని సినిమాలకంటే ఈ సినిమాకి ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. కానీ ఆ కష్టం కూడా లేకుండా చేశారు ఛార్మి. డ్యాన్స్‌, ఫైట్లు, డైలాగులు, లుక్స్‌.. ఇలా అన్నీ ఉండాలి, కానీ కొత్తగా ఉండాలి అనుకున్నప్పుడు పూరి గారిని కలిశాను. అప్పుడు వచ్చిన ఐడియా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. పూరితో కలిసి పనిచేస్తే వచ్చే కిక్కే వేరు. చివరి రోజు షూటింగ్‌కి వెళ్లాలనిపించలేదు. వెళ్తే షూటింగ్‌ అయిపోతుందేమో అని బాధపడ్డా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో లేఖా ప్రజాపతి, కాసర్ల శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.