తెరపై నా పాటలకి చిరంజీవి ప్రాణం పోశాడు

‘‘ఎంతోమంది సంగీత దర్శకులు, గాయకుల ద్వారానే నేను ప్రేక్షకులకు దగ్గరయ్యా. సంగీతమంటే నాకు ప్రాణం. సంగీతం లేనిదే నేను లేను’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన ఇటీవల సినీ మ్యుజిషియన్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగిన స్వరసంగమం సంగీత విభావరికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ సంగీత వాయిద్య కళాకారుల ఆర్థిక, ఆరోగ్య సంక్షేమం కోసం నిధుల సేకరణలో భాగంగా నిర్వహించిన కార్యక్రమం ఇది. చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు మద్రాసులోని స్టూడియోల్లోని రికార్డింగు హాళ్లలో లైవ్‌ ఆర్కెస్ట్రాతో పాటలు రికార్డింగ్‌ చేస్తుంటే అక్కడ వాతావరణం పండగలా ఉండేది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చాక చిన్న గదుల్లోనే డిజిటల్‌ ఎఫెక్టులతో సంగీతాన్ని సృష్టిస్తున్నాం. దీంతో ఎంతోమంది వాయిద్య కళాకారులు జీవనోపాధి కోల్పోయారు. ఆధునిక పరిజ్ఞానానికి సంతోషించాలో, బాధపడాలో అర్థం కావడం లేదు. కష్టాల్లో ఉన్న వాయిద్య కళాకారులను పరిశ్రమ తరఫున ఆదుకోవల్సిన బాధ్యత ఉంది. అందుకు నా వంతుగా నేను సాయమందిస్తా’’ అన్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ‘‘మేం ఎంత పాడినా మా పాటలోని అనుభూతిని గ్రహించి తెరపైన అభినయించినప్పుడే వాటికి సార్థకత. అలా నా పాటలకి అత్యద్భుతంగా అభినయించి, తెరపై ప్రాణం పోసిన నటుడు చిరంజీవి. అభిమానుల ఆనందం కోసం తనలోని అభినయ నైపుణ్య కోణాన్ని పక్కనపెట్టి కొన్ని పాత్రలు చేయాల్సి వచ్చింది. ‘సైరా నరసింహారెడ్డి’తో తనలోని అభినయ కోణాన్ని మరోసారి చూపెట్టబోతున్నార’’న్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకులు కోటి, కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్‌, ఆర్పీ పట్నాయక్‌, అనూప్‌రూబెన్స్‌, రాధాకృష్ణన్‌, కల్యాణిమాలిక్‌, శ్రీలేఖ, రఘుకుంచె తదితరులు గీతాల్ని ఆలపించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, రేణుదేశాయ్‌ తదితరులు పాల్గొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.