‘కొబ్బరి మట్ట’ కోసం కెరీర్‌ వదులుకున్నాం

‘‘కొబ్బరిమట్ట’ చూసిన ప్రేక్షకులంతా మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. ఈ సినిమా చూసి మీరు నవ్వకపోతే... ఇక సినిమాలు చేయను’’ అన్నారు సంపూర్ణేష్‌ బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రూపక్‌ రొనాల్డ్‌ దర్శకుడు. శనివారం విడుదల కానుంది. ఈసందర్భంగా హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘‘మట్టిలోంచి సంపూర్ణేష్‌బాబు అనే నటుణ్ని సృష్టించిన ఘనత సాయి రాజేష్‌ది. పేజీల కొద్దీ డైలాగ్‌ని ఒకే షాట్‌లో పూర్తి చేయడం మామూలు విషయం కాదు. ఈ డైలాగ్‌తో సంపూలోని నటుడు పూర్తి స్థాయిలో బయటకు వచ్చాడ’’న్నారు. ‘‘ఐదేళ్లక్రితం ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ సినిమా కోసం కెరీర్‌ మొత్తం వదులుకుని కష్టపడ్డాం’’ అన్నారు రచయిత, నిర్మాత సాయిరాజేష్‌. సంపూర్ణేష్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం ఆలస్యానికి చాలా కారణాలుఉన్నాయి. ఈ సమయంలో ప్రేక్షకులే మాకు అండగా నిలిచార’’న్నారు. కార్యక్రమంలో సందీప్‌ కిషన్‌, మధుర శ్రీధర్‌, షకీలా, శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.