ఆ మాట అన్నందుకే ఈ సినిమా తీశా




సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యాసింగ్‌ నాయిక. కార్తీక్‌రాజు దర్శకుడు. దయా వన్నెం, సందీప్‌కిషన్‌, వీజీ సుబ్రహ్మణ్యన్‌ నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్‌లో జెమిని కిరణ్‌, అనిల్‌ సుంకర ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అనంతరం సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘‘నన్ను నేను తెరపై చూసుకుని రెండేళ్లయ్యింది. సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియని నాలాంటివాళ్లకు అది నరకంతో సమానం. ఇక్కడ ఉండలేక విదేశాలకు వెళ్లాను. తిరిగొచ్చేసరికి లావుగా మారాను. ఆమధ్య ఓ పెద్ద నిర్మాత నా గురించి మాట్లాడుతూ ‘ఇంకెక్కడి సందీప్‌.. తన పని అయిపోయింది’ అన్నాడట. ఆయనకు నా కృతజ్ఞతలు. ఆ మాట అన్నందుకే ఈ సినిమా చేశా. అవకాశాలు రావు. మనమే సృష్టించుకోవాలి. సినిమాలు మానేసే పరిస్థితి వస్తే ఎప్పటికీ మర్చిపోని సినిమా చేసి వెళ్లిపోవాలి. పరిశ్రమలో ఇన్నేళ్లు నేను పడ్డ కష్టాలకు, కన్న కలలకు న్యాయం చేసుకోవాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. మేం ఈ సినిమాని కసితో తీశాం. నా కెరీర్‌లో అత్యుత్తమ సినిమా తీశామని నమ్మకంగా చెబుతున్నా’’ అన్నారు. ‘‘ఈ కథ చెబుతున్నప్పుడు నేనే నిర్మిస్తా అని సందీప్‌కిషన్‌ అన్నారు. దాంతో నేను షాకయ్యా. భావోద్వేగాలతో సాగే హారర్‌ చిత్రమిద’’న్నారు దర్శకుడు. ఈ నెల 12న విడుదల చేస్తామన్నారు నిర్మాతలు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.