ఎలాంటి వారైనా నవ్వాల్సిందే

అల్లరి నరేష్‌తో నేను చేసిన ‘సుడిగాడు’ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా ఆస్వాదించారో... అదే స్థాయిలో ‘సిల్లీ ఫెలోస్‌’ ప్రేక్షకుల్ని నవ్విస్తోంది’’ అన్నారు భీమనేని శ్రీనివాసరావు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్‌’. అల్లరి నరేష్, సునీల్, చిత్రశుక్ల, నందినీరాయ్‌ నాయకానాయికలుగా నటించారు. కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి, విశ్వప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవాన్ని నిర్వహించింది. ‘‘నరేష్‌కి సునీల్‌ తోడవడం, పిల్లల్ని కూడా నవ్వించే సన్నివేశాలుండటంతో చిత్రం అందరినీ అలరిస్తోంది. జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళిల కామెడీ కూడా ప్రేక్షకులకు నచ్చింది’’ అన్నారు భీమనేని. ‘‘నా సినిమాల్లో ‘కితకితలు’ తర్వాత పిల్లల్ని బాగా నవ్విస్తున్న చిత్రం ఇదే’’ అన్నారు అల్లరి నరేష్‌. ‘‘ఏ లాజిక్‌ లేకుండా మ్యాజిక్‌తో నవ్వులు పూయించాలనే తపనతో తీశాం. కోడి కూత సన్నివేశాన్ని చూసి మా పిల్లలు తెగ నవ్వుకుంటున్నారంటూ చాలా ప్రాంతాల నుంచి మాకు సందేశాలొచ్చాయి’’ అన్నారు నిర్మాతలు. సునీల్‌ మాట్లాడుతూ ‘‘నరేష్, నేను కలిసి ఎలా చేస్తే ప్రేక్షకులు నవ్వుకుంటారనే విషయంపై చర్చించుకుని కలిసి నటించాం. ఈ విజయం వెనుక భీమనేని శ్రమ పాలు ఎక్కువ’’ అన్నారు. ‘‘ఈ నవ్వుల విజయంలో భాగమైనందుకు సంతృప్తిగా ఉంద’’న్నారు చిత్రశుక్ల, నందినీ రాయ్, సంగీతదర్శకుడు శ్రీవసంత్, జయప్రకాష్‌రెడ్డి, అదుర్స్‌ రఘు, హేమ, కాసర్ల శ్యామ్‌. కార్యక్రమంలో అనిల్‌ సుంకర, పోకూరి బాబూరావు, పంపిణీదారుడు బాబ్జీ, గాయకుడు ప్రణవ చాగంటి, గీతరచయిత చిలకరెక్క గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.