ఆ ప్రయాణం ఎంతో ఆనందాన్నిచ్చింది

స్మి
త... ఈపేరుని సంగీత ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ‘హాయ్‌ రబ్బా...’ పాటతో ఎప్పుడో కుర్రకారుని తనవైపుకు లాగేసుకుంది. తెలుగులో తొలి పాప్‌ గాయనిగా ఖ్యాతి దక్కించుకుంది. నేపథ్య గాయనిగా ఇరవై ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న స్మిత హైదరాబాద్‌లో పాత్రికేయులతో మాట్లాడారు. ‘‘ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ ప్రయాణం ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తోంది. 1996లో తొలిసారి ‘పాడుతా తీయగా’ కోసం మైకు పట్టుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకూ అదే ఉత్సాహం కొనసాగుతోంది. పది భాషల్లో గాయనిగా నా గొంతు వినిపించాను. 12 ఆల్బమ్స్‌, 17 మ్యూజికల్‌ వీడియోలు, వందకు పైగా పాటలు పాడాను. 8 దేశాల్లో దాదాపు రెండొందల ప్రదర్శనలు ఇచ్చాను. నా ప్రయాణం క్యాసెట్‌ నుంచి మొదలైంది. ఆ తరవాత సీడీల్లోకి మారింది. పెన్‌ డ్రైవ్‌ నుంచి డిజిటల్‌ వ్యూస్‌లోకి ఎదిగింది. కోట్లాది మంది నా పాటలు విన్నారన్న సంతృప్తి ఉంది. ఈ ప్రయాణాన్ని పురస్కరించుకుని ఈనెల 22న హైదరాబాద్‌లో ఓ వేడుక చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నా ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాన’’న్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.