ఎవరికి చెప్పాలి.. ఐ లవ్‌ యు

పేంద్ర కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఐ లవ్‌ యు’. ‘నన్నే ప్రేమించు’ అనేది ఉపశీర్షిక. రచితా రామ్‌ కథానాయిక. ఆర్‌.చంద్రు స్వీయదర్శకత్వంలో నిర్మించారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కింది. హైదరాబాద్‌లో మోషన్‌ పోస్టర్‌ను దిల్‌రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు ఉపేంద్ర సినిమాల గురించి ఏదేదో అనుకునేవాణ్ని. కొన్నాళ్ల తర్వాత ఆయన ప్రత్యేకత తెలుసుకున్నా. కొత్త తరహా చిత్రాలెన్నో అందించారాయన. ‘ఐ లవ్‌ యు’ కూడా అలాంటిదే’’ అన్నారు. ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘నేనెప్పుడూ నన్ను జీరో అనే అనుకుంటా. మనలో ఏం లేదనుకుంటేనే ఏదో పుడుతుంది అని నా నమ్మకం. ఇప్పుడూ జీరోగానే ఆలోచించి రాజకీయ పార్టీని ఆరంభించా. రాజకీయాలు వ్యాపారంగా మారాయి. ఆ పద్ధతి మారాలనే పార్టీ పెట్టా’’ అన్నారు. లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ ‘‘కన్నడలో నాలుగు సినిమాలు తీసి విజయాన్ని అందుకున్నారు చంద్రు. తన ‘చార్మినార్‌’ను నేను తెలుగులో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’గా రీమేక్‌ చేశా. ఉప్రేంద్రతో చంద్రు ‘బ్రహ్మ’ తీసి విజయాన్ని పొందారు. అలానే తను ఉపేంద్రతో తీసిన ఈ ‘ఐ లవ్‌ యు’ కూడా విజయాన్ని దక్కించుకోవాలి’’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇది నా 11వ సినిమా. ‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్‌.ఎక్స్‌.100’ తరహా ట్రెండ్‌ సినిమాలు ఉపేంద్రగారు ఎప్పుడో తీశారు. జీవితంలో ‘ఐ లవ్‌ యు’ ఎవరికి చెప్పాలి? మనం ఎవరికి చెబుతున్నాం? అనే అంశంతో ఉపేంద్ర శైలిలో అందరికీ నచ్చేలా తెరకెక్కించామ’’న్నారు. వై.వి.యస్‌.చౌదరి, సుధాకర్‌ కోమాకుల, నటి సంజన, లాయర్‌ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఛాయాగ్రహణం: సుజ్ఞాన్‌, సంగీతం: డా।। కిరణ్‌ తోటంబైల్‌.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.