ఈ విజయం ‘మహర్షి’కే అంకితం

‘వాల్మీకి’ పేరు మార్చాలని గొడవ పెడుతున్నప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యా. ఆ సమయంలో రామ్‌చరణ్‌ అన్నయ్య నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. అక్కడికి వెళ్తే చరణ్‌తో పాటు ఎన్టీఆర్‌ కూడా ఉన్నారు. వారిద్దరే నా ఒత్తిడి అంతా తొలగించార’’న్నారు వరుణ్‌తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్‌’. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు. 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరుణ్‌ మాట్లాడుతూ ‘‘గబ్బర్‌ సింగ్‌ తీసిన హరీష్‌ శంకర్‌ నా కోసం కూడా ఓ కథ తెస్తారని ఎప్పుడూ అనుకోలేదు. మా ఇద్దరికీ సినిమా తప్ప మరేం తెలీదు. ఆ అభిరుచే ఇద్దరినీ కలిపింద’’న్నారు. హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘‘గద్దలకొండ గణేష్‌లో సినిమా గొప్పదనం గురించి తెలుపుతూ కొన్ని సంభాషణలు రాశాను. అవి బ్రహ్మానందంగారి నోటి వెంట వస్తేనే బాగుంటుందని అనిపించింది. ఆయన చెప్పిన సంభాషణలకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ప్రయాణం ‘వాల్మీకి’ పేరుతో మొదలైంది. అందుకే ఈ విజయాన్ని వాల్మీకి మహర్షికి అంకితం చేస్తున్నా’’ అన్నారు. ‘‘హరీష్‌ శంకర్‌ జీవితాన్ని చదివిన దర్శకుడు. అందుకే సంభాషణలు అంత బాగారాశార’’న్నారు బ్రహ్మానందం. ‘‘రిలీజ్‌ డేట్‌ మారింది. టైటిల్‌ మారింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మంచి సినిమా వస్తే.. ప్రేక్షకులే దాన్ని ముందుండి నడిపిస్తారని ఈ సినిమాతో మరోమారు రుజువైంద’’ని నిర్మాత గోపీ ఆచంట తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్‌ ఆచంట, పూజా హెగ్డే, భాస్కరభట్ల, మిక్కీజె మేయర్, మృణాళిని, సత్య తదితరులు పాల్గొన్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.