శేష్‌ నటనకు జపాన్‌ అభిమాని ఫిదా

తెలుగు సినిమాలు ప్రపంచమంతా సత్తా చాటుతున్నాయి. కథ నచ్చితే విదేశీ ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. ‘బాహుబలి’ చిత్రంతో కథానాయకుడు ప్రభాస్‌తోపాటు రానా, సుబ్బరాజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అందరికన్నా ఎక్కువగా జపాన్‌ వాసులు వీరిపై అభిమానాన్ని కురిపించారు. తాజాగా అడవి శేష్‌ విషయంలో ఇదే చోటు చేసుకుంది. ఆ అభిమానం మాటలకే పరిమితం కాకుండా ఏకంగా దేశం దాటేలా చేసింది. ఇంతకీ విషయమేంటంటే.. శేష్‌ నటించిన ‘ఎవరు’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. భారత్, ఇతర దేశాల్లోనూ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ‘ఎవరు‘ చూసిన రీనా అనే జపాన్‌ మహిళ శేష్‌ నటనకు ఫిదా అయి అతన్ని కలవడానికి హైదరాబాద్‌ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు శేష్‌ ‘ రీనా నా సినిమాను జపాన్‌లో చూసింది. మరోసారి చూసేందుకు హైదరాబాద్‌ వచ్చింది. ఇలాంటి వ్యక్తుల అభిమానమే నన్ను ముందుకు నడిపిస్తుంద’ని ట్వీట్‌ చేశాడు. ఆయన షేర్‌ చేసిన వీడియోలో ఉన్నది ‘ఎవరు’ చిత్ర దర్శకుడు రామ్‌జీ కాదని ప్రస్తుతం నటిస్తున్న ‘మేజర్‌’ చిత్ర దర్శకుడు శశి అని వివరించాడు. 




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.