ఆమీర్‌, కరీనా నేలపై కూర్చొని తినడం చూశారా?

ఆమీర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌.. ఎంతటి స్టార్‌ నటులో తెలిసిందే. ఎంత ఎత్తుకు ఎదిగినా వీరి ప్రవర్తనలో ఇప్పటికీ మార్పు రాలేదు. 2009లో జరిగిన ఓ సంఘటన చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇప్పుడు 2019లో ఉన్నాం. 2009 ఎందుకనుకుంటున్నారా? వీరిద్దరూ జంటగా నటించిన సూపర్‌హిట్‌ '3 ఇడియట్స్’. 2009లో విడుదలైంది. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సమయంలో ఆమీర్‌, కరీనా కలిసి నేలపై కూర్చుని తింటున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పల్లెటూరిలోని ఓ ఇంటికి వెళ్లిన స్టార్స్‌ నేలపై కూర్చొని వారు వడ్డించిన ఆహారాన్ని తినడం విశేషం. అంతేకాదు ఆహారం బాగుందని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియో ఇప్పుడు అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. స్టార్స్‌ గ్రామస్థులతో స్నేహంగా వ్యవహరించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇదీ సంగతి. ఆమీర్‌, కరీనా '3 ఇడియట్స్‌' తర్వాత 'తలాష్‌' చిత్రం కోసం కలిసి పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరు జంటగా 'లాల్ సింగ్ చద్దా' తెరకెక్కుతోంది. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.