వినాయక్‌తో సినిమా షురూ!

నందమూరి బాలకృష్ణ, వి.వి.వినాయక్‌ల క్రేజీ కలయికలో త్వరలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ ప్రాజెక్టు గురించి ఆ మధ్య కాలంలోనే వార్తలొచ్చినప్పటికీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు బాలయ్య పచ్చజెండా ఊపాడు. ప్రస్తుతం తండ్రి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ అది ఆలస్యమయ్యేలా కనిపిస్తుండటంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ను సంగీత దర్శకుడిగా తీసుకున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 27నే ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే దీనిపై బాలయ్య, వినాయక్‌ల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.