ఈ సంవత్సరకాలంలో విడుదలైన పాటలన్ని ఒక ఎత్తు ‘సామజవరగమణ’ ఒక ఎత్తు. సినిమాకి కావలసిన ప్రచారం అంతా ఈ పాటే సంపాదించి పెట్టింది. ‘అల..వైకుంఠపురములో’ పై అంచనాలు తారా స్థాయికి పెంచింది. ఇందులో నుంచి మరో రెండు గీతాలు విడుదలైన నెట్టిజన్లు ఇంకా ఈ పాటనే చూస్తున్నారు, వింటున్నారు. తమన్ సంగీతానికి సిద్‌శ్రీరామ్ గానం తోడవ్వటంతో సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సిరివెన్నెల సాహిత్యం ఇందుకు మరో ప్రత్యేకం. ఈ గీతాన్ని పారీస్‌లోని సుందరమైన ప్రదేశాల్లో శేఖర్ మాస్టర్ నృత్యాలతో తెరకెక్కిస్తున్నారు. సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో అంతకు మించి ఈ గీతంపై అమితాసక్తిగా ఉన్నారు అభిమానులు. తాజాగా మరో అరుదైన రికార్డు నమోదు చేసింది గీతం. ఇంత వరకు 100 మిలియన్స్ వీక్షణలు పొందిన తెలుగు గీతాలే చాలా తక్కువ అలాంటిది అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్స్ వీక్షణలు సొంతం చేసుకున్న పాటగా గుర్తింపు పొందింది ‘సామజవరగమణ’. ఇప్పటికే అత్యధిక లైక్స్ సొంతం చేసుకున్న గీతంగా కూడా ఇదే. ఈ విషయాన్ని బన్ని కొత్త లుక్‌తో కూడిన పోస్టర్‌తో తెలిపింది చిత్ర బృందం. ప్రస్తుతం ఈ వార్త అంతర్జాలంలో సందడి చేస్తుంది.
