‘బాహుబలి-2’ను దాటేసిన ‘భరత్‌..’!

ప్రిన్స్‌ మహేష్‌బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘భరత్‌ అను నేను’. ఏప్రిల్‌ 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టి ‘బాహుబలి’ సిరీస్‌ చిత్రాల తర్వాత రెండొందల కోట్ల క్లబ్‌లోకి చేరిన చిత్రంగా రికార్డు సాధించింది. తాజాగా ఈ చిత్రం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ రికార్డును చెన్నైలో అధిగమించింది. ‘బాహుబలి-2’ చెన్నైలో రూ.1.65 కోట్ల వసూళ్లు సాధించి అక్కడ అత్యధిక వసూళ్లు రాబట్టుకున్న సినిమాగా నిలవగా.. తాజాగా ఆ రికార్డును ‘భరత్‌ అను నేను’ దాటేసింది. తాజా సినీ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఇప్పటికే ‘భరత్‌..’ ఒక్క చెన్నైలోనే రూ.1.65 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ప్రకటించారు. ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్‌’ వంటి వరుస పరాజయాలతో డీలా పడిన మహేష్‌కు ‘భరత్‌..’ విజయం మంచి ఉత్సాహాన్నిచ్చింది. గతంలో వరుస అపజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సందర్భంలోనూ కొరటాలే ‘శ్రీమంతుడు’ వంటి చక్కటి హిట్‌ మూవీని అందించాడు. తాజాగా ఇప్పుడూ అలాంటి స్థితిలోనే ప్రిన్స్‌కు ఉపశమనాన్ని అందించాడు కొరటాల. ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని డివివి పతాకంపై దానయ్య డి.వి.వి. నిర్మించారు. కైరా అడ్వాణి కథానాయిక. ప్రకాశ్‌ రాజ్‌, శరత్‌కుమార్‌ కీలకపాత్రల్లో కనిపించారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.