ఆడవాళ్ల రక్షణకి.. ఏ చెట్టునాటాలి?

‘‘భూమిని కాపాడుకోవడానికి ప్రతి ఇంటికి ఒక్క చెట్టు నాటమన్నారు సరే.! మరి తల్లిలాంటి ఆడవాళ్లను కాపాడుకోవడానికి ఏ చెట్టు నాటాలి’’ అంటూ సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు యువ కథానాయకుడు నాగశౌర్య. ఈ యువ హీరో దర్శకుడిగా మారి నిర్మించిన లఘుచిత్రం ‘భూమి’. ఆదివారం మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు నాగశౌర్య. నేడు సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా చక్కటి సందేశాన్ని ఇస్తూ ఈ సినిమాను రూపొందించారు. ‘‘భూమి.. భూమిలాంటిదే తల్లి కూడా.. ఎంతకష్టమైనా భరిస్తుంది.. ఎంత బరువైనా మోస్తుంది. కొన్ని మదమెక్కిన మగ జంతువులు ఆడవారి మీద పైశాచిక బలాన్ని చూపిస్తున్నాయి. నిజమైన బలం మనం వాళ్లకు ఇచ్చేదే తప్పా.. వాళ్ల మీద చూపించేది కాదు. భూమిని కాపాడుకోవడానికి ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటమన్నారు. మరి తల్లిలాంటి ఆడడవాళ్లను కాపాడుకోవడానికి ఏ చెట్టు నాటాలి’’ అంటూ ఈ లఘు చిత్రం ద్వారా ఆలోచింపజేసే సందేశాన్నిచ్చారు శౌర్య. ఈ సినిమాను ట్విట్టర్‌ ద్వారా పంచుకుంటూ ‘‘భూమి’ ఇదిగో.. అమ్మ. నీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నా కష్టసుఖాల్లో నువ్వు వెన్నంటే ఉన్నావు. లవ్‌ యు సోమచ్‌’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ‘భూమి’ చిత్రం వైరల్‌గా మారింది.© Sitara 2018.
Powered by WinRace Technologies.